gannavaram: చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ: యార్లగడ్డ

Gannavaram Former ycp leader yarlagadd venkatrao met chandrababu today

  • టీడీపీ అధినేతను కలుసుకున్న గన్నవరం లీడర్
  • కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడి
  • త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన యార్లగడ్డ

తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరనున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ఈ విషయంపై చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యాక యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు.

దాదాపు 19 ఏళ్ల పాటు అమెరికాలో నివసించిన తాను రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగొచ్చినట్లు తెలిపారు. పాత సంగతులతో పాటు ప్రస్తుతం గన్నవరంలో తాను, తన అనుచరవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబుకు వివరించినట్లు పేర్కొన్నారు. టీడీపీలో చేరేందుకు తను సమ్మతి తెలపగా.. కలిసి పనిచేద్దాం రమ్మంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆహ్వానించారని తెలిపారు. త్వరలోనే టీడీపీలో చేరతానని, పార్టీ అధినేత ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి యార్లగడ్డ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అయితే, ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి ఇటీవల వైసీపీకి మద్దతు తెలపడంతో పార్టీ తనను పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. తనను, తన అనుచరవర్గాన్ని ఇబ్బందులకు గురిచేయడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. టీడీపీలో చేరేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానని, అదే విషయం చెప్పి మరీ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చానని వివరించారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించారని, ఇది పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు అంగీకరించాల్సిన నిజమని యార్లగడ్డ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారిలో చంద్రబాబు రెండో వ్యక్తి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం ఆలోచించే నేత చంద్రబాబేనని కొనియాడారు. కాగా, చంద్రబాబుతో భేటీలో గన్నవరం టికెట్ పై హామీ లభించిందా అని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా, గుడివాడ నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.

  • Loading...

More Telugu News