early dinner: ఈవినింగ్ 7లోపు డిన్నర్ చేస్తే.. లాభం ఏంటో తెలుసా..?
- శరీరంలో మెరుగ్గా జీవక్రియలు, హార్మోన్ల ఉత్పత్తి
- కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు రక్షణ
- నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది
సాయంత్రం 7 గంటలకే భోజనం. రాత్రి 9 గంటలకే నిద్ర. 30-40 ఏళ్లకు వెనక్కి వెళ్లి చూస్తే పల్లె వాసుల జీవనంలో సాధారణంగా కనిపించేది ఇదే. కానీ కాలంతోపాటు జీవనంలోనూ ఎంతో మార్పు సంతరించుకుంది. గతంతో పోలిస్తే నేడు ఆహార వేళలు మారిపోవడమే కాదు, అనారోగ్య సమస్యలు సైతం పెరిగాయి. రాత్రి 7 గంటల తర్వాత భోజనం చేయకుండా ఉండడమే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే కొందరికి ఈ విషయంలో మినహాయింపు ఉంది.
ఫలానా సమయానికే తినేయాలన్న ప్రామాణిక సూత్రం ఏదీ లేదు. రాత్రి 7 గంటల తర్వాత తినకూడదా? అంటే అదేమీ లేదు. కాకపోతే ఆహారంలో భాగంగా ఏమి తీసుకుంటున్నారనేది.. ఇక్కడ కీలకం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ రాత్రి 7 గంటల తర్వాత బాగా ఆకలి వేస్తున్నట్టు అయితే అప్పుడు తినడమే సరైనది. రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉండే వారికి సాయంత్రం 7 గంటల్లోపు భోజనం ముగించేయడం సూచనీయం కాదు. దీనివల్ల తిరిగి వారు నిద్రించే లోపే మళ్లీ ఆకలి వేసే పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రించే వారు 7 గంటల్లోపు కావాలంటే కడుపునిండా భోజనం చేసి, ఆ తర్వాత ఆకలి వేస్తే పాలు తాగడం వంటి స్వల్ప ఆహారానికి పరిమితం కావాలి. కాకపోతే రాత్రి 7 గంటల్లోపు భోజనం చేసి 9 గంటలకు నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
సరైన రిథమ్
మన శరీరం సర్కాడియం రిథమ్ ఆధారంగా నడుస్తుంటుంది. ఈ రిథమ్ కు అనుగుణంగానే ఆహార వేళలు ఉండాలి. అప్పుడు చక్కగా జీర్ణమవుతుంది. జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. దీనివల్ల లివర్ పై ఒత్తిడి తగ్గుతుంది. హానికారక వ్యర్థాలను బయటకు పంపడానికి వీలు చిక్కుతుంది. కాలేయానికి విశ్రాంతి ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి చర్యలతో పేగుల ఆరోగ్యం బాగుంటుంది.
రక్తంలో షుగర్
రాత్రి భోజనం ముందుగా ముగించేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీర కణాలు ఇన్సులిన్ కు మెరుగ్గా స్పందిస్తాయి. దానివల్ల రక్తంలో షుగర్ నియంత్రణ మంచిగా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల్లో అస్థిరతలు తగ్గుతాయి.
నిద్ర నాణ్యత
రాత్రి పూట ఆలస్యంగా తినడం, వెంటనే నిద్రించడం అనేవి మంచి అలవాట్లు కావు. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ముందుగా తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.
గుండెకు మంచిది
రాత్రి వేళ ఆలస్యంగా తినడం, అధిక కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం గుండెకు నష్టం చేస్తుంది. ముందుగా తినడం, అది కూడా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు మంచి జరుగుతుంది. కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుంది.
హార్మోన్ల ఉత్పత్తి
మన శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి కూడా ఓ క్రమం ప్రకారం జరుగుతుంటుంది. ముందస్తుగా డిన్నర్ ముగించడం వల్ల శరీర జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి. జీవక్రియలు సరిగ్గా ఉంటే, హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు.