Steel Bridge: హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. వీడియో ఇదిగో!

Hyderabad Steel Bridge to be Start from Today Minsiter KTR Flyover Inauguration

  • రూ.450 కోట్ల ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం
  • బ్రిడ్జికి దివంగత నేత, మాజీ మంత్రి నాయిని పేరు
  • లోయర్ ట్యాంక్ బండ్- వీఎస్టీ మధ్య తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

హైదరాబాద్ వాసులకు శనివారం మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి మాజీ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 48 ప్రాజెక్టులలో ఇదొకటి. సిటీ చరిత్రలోనే తొలిసారిగా భూ సేకరణ జరపకుండా, పూర్తిగా ఉక్కుతోనే నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం విశేషం. దక్షిణాదిలో అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఈ వంతెన రికార్డులకెక్కింది. 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ఇందిరా పార్క్, వీఎస్టీ మార్గంలో నిత్యం ప్రయాణించే వేలాది వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ మార్గంలో వాహనాల రద్దీ తగ్గనుంది. 

ఇప్పటి వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీది నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాలు పట్టేది.. స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడంపై నాయిని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ పోగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) లో భాగంగా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటిలో 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్‌ పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్‌ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను ప్రభుత్వం పూర్తిచేసింది. తాజాగా మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించిన వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి ఇందులో 36 వ ప్రాజెక్టు అని ప్రభుత్వం వెల్లడించింది.

More Telugu News