London: లండన్ ఆసుపత్రిలో పసికందులను చంపేస్తున్న నర్సును పట్టిచ్చిన భారత సంతతి వైద్యుడు
- 2015లోనే అనుమానం వ్యక్తం చేసినట్లు వెల్లడి
- పోలీసులు ముందే స్పందిస్తే బాగుండేదని వ్యాఖ్య
- ఇంకొందరు చిన్నారులు ప్రాణాలతో ఉండేవారన్న డాక్టర్
ఆసుపత్రిలో పసికందుల ప్రాణాలు తీస్తున్న నర్సును లండన్ కోర్టు నేరస్థురాలిగా నిర్ధారించింది. మొత్తం ఏడుగురు చిన్నారుల హత్యలో ఆమెను దోషిగా తేల్చింది. మరో ఆరుగురు పసికందులపై హత్యాయత్నం చేసినట్లు కోర్టు పేర్కొంది. నిందితురాలికి ఈ నెల 21న శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో హంతకురాలిని న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టడంలో భారత సంతతి వైద్యుడు డాక్టర్ రవి జయరాం వాంగ్మూలం కీలకంగా మారింది.
లండన్ లోని చెస్టర్ సిటిలో ఉన్న చెస్టర్ ఆసుపత్రిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. 2015 లో ఆసుపత్రిలో జన్మించిన ముగ్గురు పసికందులు చనిపోయారు. దీనిపై అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న భారత సంతతి వైద్యుడు రవి జయరాం అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసుల ముందు తన అనుమానాలు వ్యక్తం చేసినా వారు పట్టించుకోలేదని వివరించారు. అప్పుడే స్పందించి ఉంటే ఇంకొంత మంది చిన్నారులను కాపాడే వాళ్లమని వాపోయారు. ఆ పిల్లలు ఇప్పుడు స్కూలుకు వెళుతుండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెస్టర్ ఆసుపత్రిలో పిల్లల సంరక్షణ వార్డులో విధులు నిర్వహిస్తున్న నర్సు లూసీ లెట్బీ ఈ దారుణానికి పాల్పడింది. రోజుల చిన్నారులకు ప్రమాదకరమైన ఇంజక్షన్లు ఇవ్వడంతో సహా వివిధ పద్ధతులలో చంపేసింది. 2015-2016 మధ్య కాలంలో ఆసుపత్రిలో 13 మంది పసికందులు చనిపోగా.. వారి మరణాల వెనక లెట్బీ హస్తం ఉందని జయరాం ఆరోపించారు. ఆసుపత్రిలో అకారణంగా పిల్లలు చనిపోతుండడంపై 2017లో జరిపిన విచారణలో నర్సు లెట్బీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మరింత లోతుగా విచారణ జరిపారు. 2018లో నర్సును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ నెల 17న లెట్బీని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 21 న లెట్బీకి శిక్ష ఖరారు చేయనున్నట్లు పేర్కొంది.