WHO: ‘ఆయుష్మాన్ భారత్’ బీమా పథకంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు
- జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశాల్లో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ప్రశంసలు
- దేశప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే దిశగా కేంద్రం చర్యలపై హర్షం
- ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకమని వ్యాఖ్య
దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే దిశగా భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న జీ20 హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ ప్రారంభ ఉపన్యాసంలో ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పథకంపై ప్రశంసలు కురిపించారు.
‘‘ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే దిశగా కేంద్రం మంచి ప్రయత్నం చేస్తోంది. ఆయుష్మాన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం’’ అని టెడ్రోస్ కొనియాడారు. ఈ సమావేశాలకు వేదికగా నిలిచిన భారత్‌కు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. గాంధీనగర్‌కు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తాను సందర్శించానని, అక్కడి వసతులు, సేవలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన టెలీ మెడిసిన్ సేవలను కూడా కొనియాడారు.
మూడు రోజుల పాటు జరిగే జీ20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశం నేటితో ముగియనుంది. వివిధ దేశాలకు చెందిన మొత్తం 70 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వ కృషికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం తెలిపారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో భారత్ అవలంబిస్తున్న విధానాన్ని సమావేశానికి వచ్చిన వారికి వివరిస్తున్నాం. వారందరూ కేంద్రం విధానాలను ప్రశంసిస్తున్నారు. ప్రజారోగ్య రంగంలో ఓ సమ్మిళిత విధానాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని మీడియాతో మంత్రి అన్నారు.