Nara Lokesh: ఎల్లుండి చంద్రబాబు నివాసం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర
- సొంత నియోజకవర్గం మంగళగిరిలో లోకేశ్ యువగళం
- నేడు వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర... పలువర్గాలను కలిసిన టీడీపీ యువనేత
- రేపు కోర్టుకు హాజరు కానున్న లోకేశ్... పాదయాత్రకు ఒకరోజు విరామం
- ఆగస్టు 19న విజయవాడలో ప్రవేశించనున్న లోకేశ్ యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సొంత నియోజవకర్గం మంగళగిరిలో యువగళం పాదయాత్ర నిర్వహించారు. నేడు యర్రబాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, సాయిబాబా గుడి, సలామ్ సెంటర్, గేట్ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఉండవల్లి సెంటర్ మీదుగా కరకట్ట సమీపంలోని చంద్రబాబు నివాసం వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.
లోకేశ్ కు రేపు కోర్టు పని ఉన్నందున యువగళం పాదయాత్రకు 18వ తేదీన తాత్కాలిక విరామం ప్రకటించారు. లోకేశ్ తిరిగి 19వ తేదీ సాయంత్రం చంద్రబాబు నివాసం నుంచి యాత్ర ప్రారంభించి, ప్రకాశం బ్యారేజి మీదుగా విజయవాడ నగరంలోకి అడుగుపెడతారు.
జగన్ ఫిష్ ఆంధ్రతో యువత భవిత ఫినిష్!
నులకపేటలో ఫిష్ ఆంధ్ర మార్టు వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఇది మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో జగన్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర దుకాణం. నేతిబీరలో నెయ్యి లేనట్లే... ఫిష్ ఆంధ్రలో కూడా చేపలు మాత్రం కనపడవు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలివ్వడం చేతగాని జగన్... చదువుకున్న యువకులతో చేపలు, మాంసం దుకాణాలు పెట్టించాడు.
చంద్రబాబు పాలనలో కియా, టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్ లాంటి సంస్థలను రప్పించి లక్షలాదిమందికి ఉద్యోగాలిస్తే... సైకో పాలనలో ఉన్న పరిశ్రమలను తరిమేసి యువత భవితను చీకటిమయం చేశారు. విధ్వంసకుడి అరాచకానికి, విజనరీ లీడర్ కు ఉన్న తేడా గమనించారా? అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
మాది హ్యూమనిజం... మీది ఫ్యాక్షనిజం!
పేదోళ్ల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల రద్దుతో సైకో ముఖ్యమంత్రి అభాగ్యుల నోటి దగ్గర కూడు లాగేస్తే, సొంత నిధులతో మేం అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాం అని లోకేశ్ వెల్లడించారు. "ఈ ఫోటోలో కన్పిస్తున్నది మంగళగిరి నియోజకవర్గం నులకపేటలో నేను ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్.
పేదలు కడుపు నిండా పట్టెడన్నం తింటే ఓర్చుకోలేని జగన్... వేదికలపై మాత్రం నేను పేదవాడి పక్షమంటాడు. జగన్ రెడ్డి సిద్ధాంతం పచ్చినెత్తురు తాగే ఫ్యాక్షనిజమైతే... మాది సకలజనులు సుభిక్షంగా ఉండాలనే హ్యుమనిజం" అని ఉద్ఘాటించారు.
లోకేశ్ సమక్షంలో సైకిలెక్కిన మరో 300 కుటుంబాలు
మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేతలంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా... గురువారం డాన్ బాస్కో స్కూల్ వద్ద విడిది కేంద్రంలో పలువురు వైసీపీ నేతలు లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
నిడమర్రు గ్రామానికి చెందిన పాములపాటి వీరశివారెడ్డి, తాడేపల్లికి చెందిన సూరెడ్డి వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. నవులూరుకు చెందిన ఏపూరి సురేష్ నాయుడు, పంచల సువార్త, వేమూరు ప్రణయ్, యర్రబాలెం గ్రామానికి చెందిన దూళ్ల శేషు గోపయ్య వీరితో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 13వ వార్డు, తాడేపల్లిలోని 2, 5, 7, 23వ వార్డులు, నవులూరు, కృష్ణాయపాలెం, యర్రబాలెంకు చెందిన సుమారు 300 పైగా కుటుంబాల వారు చేరారు.
వీరందరికీ లోకేశ్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మహిళపై విధి పగబడితే లోకేశ్ అన్న దారి చూపాడు!
ఆమె పేరు షేక్ రెహానా, తాడేపల్లిలో నివాసముంటోంది. ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటి బిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో స్థానిక నాయకుల ద్వారా తమ కష్టాలను లోకేశ్ కు విన్నవించుకుంది. లోకేశ్ పాదయాత్రకు బయలుదేరే నెల ముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు రూ.30 వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ ఆమె లోకేశ్ కు అల్పాహారాన్ని అందజేసింది.
గతంలో రూ.300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.800 అయిందని చెప్పింది. తాను నివసించే ఇంటికి పట్టాలేదని తెలిపింది. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటిపట్టాతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పి లోకేశ్ ముందుకు సాగారు.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2496.5 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 10.2 కి.మీ.*
*మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
*(18-8-2023న పాదయాత్రకు విరామం. 188వరోజు పాదయాత్ర ఉండవల్లిలో చంద్రబాబుగారి నివాసం నుంచి 19వతేదీ సాయంత్రం 4గంటలకు ప్రారంభమవుతుంది.)*
*****