Shimla: వరదలతో హిమాచల్ ప్రదేశ్ లో వేలాడుతున్న రైలు ట్రాక్ లు
- టాయ్ ట్రైన్ మార్గంలో కొట్టుకుపోయిన ట్రాక్ లు
- గాల్లో వేలాడుతూ కనిపిస్తున్న తీరు
- పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే శాఖ
ప్రకృతి అందాలకు నెలవైన హిమాచల్ ప్రదేశ్ వరదలకు విలవిలలాడుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కళ తప్పాయి. ముఖ్యంగా సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో ప్రముఖ రైల్వే మార్గం (టాయ్ ట్రైన్) అంతా కొట్టుకుపోవడంతో ట్రాక్ లు గాల్లో వేలాడుతూ కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు అక్కడి చాలా ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం పెద్ద ఎత్తున నమోదవుతోంది.
ఈ రైల్వే ట్రాక్ ను కేవలం దేశ రైలు నెట్ వర్క్ లో భాగంగా కాకుండా, స్థానికులు తమ చిరకాల గుర్తులుగానూ చూస్తుంటారు. ఈ రైల్వే లైను కల్కా నుంచి సిమ్లా వరకు విస్తరించి ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఇది కూడా ఒకటి. దీన్ని టాయ్ ట్రైన్ ట్రాక్ అని కూడా పిలుస్తారు. వందేళ్లకు పైగా చరిత్ర దీనికి ఉంది.
ఈ రైలు మార్గం 96 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. కల్కా నుంచి మొదలై సిమ్లా చేరుకుంటుంది. ఈ మార్గంలో ఎన్నో పర్వాలను అదిదాటుతూ వెళుతుంది. మొత్తం ఐదు గంటల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది. దెబ్బతిన్న రైలు ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది. వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, రూ.10వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే.