Pakistan: విమానం టేకాఫ్ అయ్యాక తన వద్ద బాంబు ఉందని బెదిరించిన పాకిస్థాన్ నటుడు!
- సిడ్నీ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు బయల్దేరిన మహమ్మద్ ఆరిఫ్
- విమానాన్ని పేల్చివేస్తానని భయాందోళనలకు గురి చేసిన వైనం
- లగేజీని తనిఖీ చేసి, విమానాన్ని వెనక్కి మళ్లించిన సిబ్బంది
- బాంబు ఉందంటూ భయాందోళనకు గురి చేసిన వీడియో నెట్టింట వైరల్
తన వద్ద బాంబు ఉందంటూ విమానంలో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పాకిస్థాన్‌కు చెందిన నటుడిగా గుర్తించారు. వివరాల ప్రకారం... 45 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు విమానంలో బయలుదేరాడు. టేకాఫ్ అయిన కాసేపటికి విమానాన్ని పేల్చివేస్తానని గట్టిగా అరిచాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే సిబ్బంది అతని లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఆ తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లించి అతడిని దించేశారు. పోలీసులు అతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా మహమ్మద్ ఆరిఫ్ పాకిస్థాన్‌కు చెందిన నటుడు. రెండు దశాబ్దాల క్రితం ఓ మ్యూజిక్ ఆడియోలోనూ కనిపించాడు. ప్రస్తుతం అతను నటనకు దూరంగా ఉన్నాడు. అతను మానసికవ్యాధితో బాధపడుతున్నట్లు అతడి న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.