Perni Nani: చంద్రబాబుది అంతా సుత్తి విజన్, దిక్కుమాలిన విజన్: పేర్ని నాని

Perni Nani fires at Chandrababu for his 2047 vision

  • 2020కి చేసిందేం లేదు కానీ విజన్ 2047 అంటున్నాడని ఆగ్రహం
  • విద్యుత్, విద్యా, ఆరోగ్య రంగంపై చంద్రబాబు విజన్ ఏమిటని నిలదీత
  • విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే తూటాలు పేల్చిన వ్యక్తి, ఇప్పుడు ఛార్జీ తగ్గిస్తాడా? అని ప్రశ్న
  • 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం పొడిచాడని ఎద్దేవా
  • చిత్తూరు జిల్లాకు ఎన్ని చెంబుల నీళ్లిచ్చావని ప్రశ్న
  • చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ జబ్బులను కూడా పెంచలేదని ఆరోపణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్ 2020తో ఏం పొడిచాడని ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుది అంతా సుత్తి విజన్, దిక్కుమాలిన విజన్ అన్నారు. విద్యుత్, విద్యారంగం, ఆరోగ్య రంగంపై ఆయనకు ఉన్న విజన్ ఏమిటి? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇరవై ఏళ్ల క్రితం పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన వారిని తూటాలతో పిట్టలను కాల్చినట్లు కాల్చి ముగ్గుర్ని చంపేసిన వ్యక్తి ఛార్జీలు తగ్గిస్తాననడం విడ్డూరమన్నారు. ఇదేనా విజన్? అని ప్రశ్నించారు.

చంద్రబాబు 2020, 2047తో కాలజ్ఞానం చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్‌కు సంబంధించి 2019 నాటికి రూ.22వేల కోట్ల బకాయిలను ప్రజలపై పెట్టి వెళ్లారన్నారు. నాడు ఉచిత విద్యుత్ ఇస్తానని వైఎస్ చెబితే కరెంట్ తీగలపై బట్టలు ఆరేయడానికి మాత్రమే పనికి వస్తుందని విమర్శలు గుప్పించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు. 1995లో మొదటిసారి ఏదో కుయుక్తులు చేసి.. వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాడని, నాటి నుండి 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు.

45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం పొడిచాడో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ను కసక్కుమని వెన్నుపోటు పొడిచి విజన్ 2020 అని చెప్పాడని, కానీ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని చంద్రబాబు చెబుతుంటారని, మరి అలాంటి వ్యక్తిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? ఎందుకు కూల్చారు? అని ప్రశ్నించారు.

ఇరిగేషన్‌లో చంద్రబాబు విజనరీ ఏమిటో చెప్పాలన్నారు. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానని అన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాక కనీసం నీ చిత్తూరు జిల్లాకు ఎన్ని చెంబుల నీళ్లు ఇచ్చావ్? కనీసం కుప్పం నియోజకవర్గానికైనా ఇచ్చావా? అని నిలదీశారు. చంద్రబాబు విజన్ ఏ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందన్నారు. చిత్తురుకే దిక్కులేదు.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడని విమర్శించారు. అసలు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టాడని ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నారో చెప్పాలన్నారు. ఆవగింజంత సిగ్గులేని వ్యక్తి అని దుయ్యబట్టార.

కనీసం విద్యారంగాన్ని పట్టించుకన్నాడా? సొంతూరు నారావారిపల్లిలో ప్రభుత్వ బడిని బాగు చేసిన విజన్ అయినా ఉందా? ఎన్ని హాస్టల్స్‌ను టీడీపీ అధినేత మూసివేశారు? కనీసం కొత్త స్కూల్ ఒక్కటైనా తెరిచారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరోగ్యం పట్ల కూడా చంద్రబాబు విజన్ ఏమంటే.. పేదలను ఇబ్బంది పెట్టడమే అన్నారు. పేదలు ఆర్థికంగా కుదేలయ్యేది ఎక్కువగా జబ్బుల వల్లే అన్నారు. ప్రభుత్వాసుపత్రులను ప్రజలకు చేరువయ్యేలా చేయాల్సిన చంద్రబాబు యూజర్ ఛార్జీలతో మోత మోగించారన్నారు. తెలంగాణలోని అదిలాబాద్ నుండి ఏపీలోని శ్రీకాకుళం వరకు బీపీ, ఎక్స్‌రే, మందులు, రక్ష పరీక్షలకు డబ్బులు వసూలు చేశారన్నారు. 2004లో వైఎస్ వచ్చాక పేదలపై భారం తగ్గిందన్నారు. ఇది దివాలాకోరుతనం విజన్ కాదా? అన్నారు.

చంద్రబాబు ఇదే చేశాడని చెప్పుకోవడానికి ఏముందో చెప్పాలన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ ఎవరివని నిలదీశారు. కాకిలాగా పది కాలాలు బతకడం ఎందుకు? డెబ్బై ఏళ్లు ఉండి ఏం లాభం? 2047 వరకు బతకాలా? ప్రజలకు మేలు చేసి వైఎస్‌లా బతికితే చాలదా? అన్నారు.

జగన్ నీ కంటే ఎంతో చిన్నవాడైనప్పటికీ తాను అధికారంలోకి వచ్చాక 1540 కొత్త అంబులెన్సులు తెచ్చాడన్నారు. 2014లో కాంగ్రెస్ దిగిపోయే సమయానికి ఆరోగ్యశ్రీ కింద 1000 జబ్బులు ఉంటే చంద్రబాబు వాటిని పెంచలేదని, కానీ 2019లో జగన్ గెలిచాక 2000కు పైగా పెంచారన్నారు. పైగా చంద్రబాబు రూ.900 కోట్ల ఆరోగ్యశ్రీ అప్పులు జగన్ పైన పెట్టి వెళ్లాడన్నారు.

  • Loading...

More Telugu News