Rishi Sunak: ప్రధానిగా కాదు.. ఓ హిందువుగా ఇక్కడకు వచ్చా.. బ్రిటన్ ప్రధాని వ్యాఖ్య
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రామ కథపై ప్రవచనం
- ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు నేతృత్వంలో కార్యక్రమం ఏర్పాటు
- రామ కథ వినేందుకు వచ్చిన ప్రధాని రిషి
- హిందూమత విశ్వాసాలు తన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని వెల్లడి
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటిలో ఏర్పాటు చేసిన రామ కథపై ప్రవచనం కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రామ కథ వినేందుకు రిషి సునాక్ వెళ్లారు. ‘‘ఈ కార్యక్రమానికి హాజరు కావడం నాకెంతో గర్వకారణం. ఇక్కడకు నేను ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా వచ్చా’’ అని ఆయన పేర్కొన్నారు.
పంజాబీ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు సేవలందిస్తున్న తొలి శ్వేతజాతీయేతర ప్రధానిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాను హిందువునని ఆయన గతంలో పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఆయన బాల్యం మొత్తం సౌతాప్టన్ లోనే గడిచింది.
కాగా, ప్రధాని రిషికి మురారీ బాపు సాదర స్వాగతం పలికారు. ‘‘ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికొచ్చిన మీకు ఘన స్వాగతం’’ అని వ్యాఖ్యానించారు. హిందూమత విశ్వాసాలు తన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని, ప్రధానిగా వీలైనంత మెరుగ్గా పనిచేసేందుకు ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని రిషి సునాక్ తెలిపారు.
ఇక, ప్రవచనం వేదికపై ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్‌ను ప్రస్తావించిన రిషి సునాక్, తన అధికారిక కార్యాలయంలోని టేబుల్‌పై కూడా గణేశుడి విగ్రహం ఉందని పేర్కొన్నారు. పని చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలన్న విషయాన్ని తనకు విగ్రహం జ్ఞాపకం చేస్తుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిషి తన బాల్యం గురించి కూడా ప్రస్తావించారు. చిన్నతనంలో తాను తరచూ సౌతాప్టన్ లోని గుడికి వెళ్లి వస్తుండేవాడినని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబం పూజలు, హోమాలు చేస్తుండేదని చెప్పారు. అనంతరం, భక్తులకు తాము తీర్థప్రసాదాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్నారు.