Nara Lokesh: నేను స్టాన్ ఫోర్డ్ లో చదివాను... క్వాలిఫికేషన్ తో పాటు ప్రజలకు దగ్గరవ్వడం కూడా ముఖ్యమే: నారా లోకేశ్
- తాడికొండ నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
- తాడికొండలో ఆడిటర్లతో లోకేశ్ ముఖాముఖి
- సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
- లోకేశ్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో రేపటి నుంచి యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. 184వరోజు యువగళం పాదయాత్ర రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై పొన్నెకల్లు మీదుగా తాడికొండ అడ్డరోడ్డువద్దకు చేరుకుంది.
భోజన విరామానంతరం తిరిగి ప్రారంభమైన పాదయాత్ర రాత్రి పొద్దుపోయాక నారా లోకేశ్ సొంత నియోజకవర్గం మంగళగిరిలోకి ప్రవేశించింది. మంగళగిరి ఇన్ చార్జి నందం అబద్దయ్య, పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు తదితరుల నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం లభించింది. అనంతరం లోకేశ్ నిడమర్రు విడిది కేంద్రానికి చేరుకున్నారు.
అంతకుముందు లోకేశ్ తాడికొండలో ఆడిటర్లతో సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను సానుకూలంగా విన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నింటినీ పరిష్కరించి, ఆడిటర్లు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆడిటర్లతో ముఖాముఖిలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...
ఆడిటర్ల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళతాం
2024 లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఆగిపోయిన గ్రోత్ ఇంజిన్ ని రీస్టార్ట్ చేస్తాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆడిటర్లు, సీఏలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి మా ఎంపీల ద్వారా కేంద్రం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం.
మూర్ఖపు ముఖ్యమంత్రి దెబ్బకి అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. నేను ఎంతో కష్టపడి తెచ్చిన ఫాక్స్ కాన్ ని జగన్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడు.
ఆడిటర్లు కూడా బాధితులే!
జగన్ పాలనలో ఆడిటర్లు, సీఏలు కూడా బాధితులే. ఆడిటర్లకి ఇప్పుడు పని లేని పరిస్థితి వచ్చింది. ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. గతంలో ఏ సీఎం జగన్ లా రాష్ట్రం పరువు తియ్యలేదు. ఇంత చెత్త పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అని కోరుకుంటాను.
కానీ ఇప్పటి సీఎంకి ఆ ఆలోచనే లేదు. అమర్ రాజా లాంటి కంపెనీని వేధించి తరిమేశాడు. జగన్ నిర్ణయాల వలన భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతాయి. మన రాష్ట్రంలోని పేపర్లు చూస్తే కక్ష సాధింపు, దాడులు, అత్యాచార వార్తలు కనిపిస్తాయి. పక్క రాష్ట్రాల పేపర్లు చూస్తే పెట్టుబడులు, రోజుకో కంపెనీ వచ్చింది అనే వార్తలు కనిపిస్తున్నాయి.
అభివృద్ధి ఆగకుండా సంక్షేమం!
సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ. సంక్షేమంతో పాటు అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చక్రం సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం. పేదరికం లేని రాష్ట్రం మా ఎజెండా. కంప్యూటర్ అన్నం పెడుతుందా? సైబర్ టవర్ వలన ఉపయోగం ఏంటి? అన్నారు.
ఇప్పుడు ఒక రాష్ట్రానికి సైబరాబాద్ దిక్సూచిగా మారింది. చంద్రబాబు గారి విజన్ వలన హైదరాబాద్ అభివృద్ది చెందింది. మిగిలిన ముఖ్యమంత్రులు అభివృద్ధిని కొనసాగించారు. చంద్రబాబు గాడితప్పిన ఏపీని మళ్ళీ అభివృద్ది పథంలో నడిపిస్తారు. మహా నగరాలు నిర్మించే అవకాశాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ది చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. .
మైక్రో లెవల్ డెవలప్ మెంట్ మోడల్ తెస్తాం
స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్న నేను మంగళగిరిలో ఓడిపోయాను. క్వాలిఫికేషన్ తో పాటు ప్రజలకు దగ్గర అవ్వడం కూడా ముఖ్యం. నిపుణులు కూడా ప్రజలకు దగ్గర అయ్యి సేవ చేస్తే రాజకీయాల్లో మంచి అవకాశాలు వస్తాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైక్రో లెవల్ డెవలప్ మెంట్ మోడల్ తీసుకొచ్చి చిన్న నగరాలను కూడా అభివృద్ది చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తాం. పెట్టుబడులు తగ్గించే విధానం తీసుకొస్తాం.
మార్గదర్శిని పనిగట్టుకొని వేధిస్తున్నారు!
మార్గదర్శి ప్రారంభించి 62 ఏళ్లు అయ్యింది. పారదర్శకంగా నడిపిస్తున్నారు. అలాంటి మార్గదర్శినీ టార్గెట్ చేసి వేధిస్తున్నాడు జగన్. కనీసం ఒక్క డిపాజిటర్ ఫిర్యాదు చెయ్యకుండా వేధిస్తున్నారు. హెరిటేజ్ ని కూడా వేధించారు.
విజయసాయి రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశాడు. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. జగన్ కక్ష సాధింపు చర్యల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం!
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. టీడీపీ హయాంలో ఎంఎస్ఎంఈకి ప్రత్యేక పాలసీ ఇచ్చాం. కులం, మతం, ప్రాంతం పేరుతో ఎంఎస్ఎంఈ రంగాన్ని జగన్ చంపేశాడు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తాం. బడుగు బలహీనర్గాలకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అనేది టీడీపీ లక్ష్యం.
ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తాం
జగన్ ప్రభుత్వం ఆడిటర్లకు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ట్యాక్స్ రద్దు చేస్తాం. పన్నుల వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలి. పారదర్శకత తీసుకురావాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికి వేధింపులు లేకుండా స్వేచ్చగా ఆడిటర్లు వృత్తిని నిర్వహించుకునే అవకాశం కల్పిస్తాం.
దళితులపై జగన్మోసపురెడ్డిది కపట ప్రేమే!: లోకేశ్ సెల్ఫీ చాలెంజ్
తాడికొండలో సెల్ఫీ ఛాలెంజ్ విసురుతూ... "ఈ ఫోటోలో కన్పిస్తున్నది తాడికొండలో మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. గత టీడీపీ ప్రభుత్వంలో దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం తాడికొండతోపాటు గుంటూరు జిల్లాలో మరో నాలుగు చోట్ల గురుకుల పాఠశాలలు నిర్మించాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవు" అని విమర్శించారు.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2476 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 22.8 కి.మీ.*
*185వరోజు (15-8-2023) యువగళం వివరాలు*
*మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
మధ్యాహ్నం
2.00 – నిడమర్రు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
2.45 – నిడమర్రు సెంటర్ లో పసుపు రైతులతో సమావేశం.
3.30 – బేతపూడి బాపూజీనగర్ లో స్థానికులతో మాటామంతీ.
సాయంత్రం
4.00 – మంగళగిరి రైల్వేగేటు వద్ద మహిళలతో సమావేశం.
4.30 – మంగళగిరి మార్కెట్ యార్డు వద్ద టిడ్కో లబ్ధిదారులతో భేటీ.
4.40 – పాతబస్టాండు వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
5.10 - మున్సిపల్ ఆఫీసు వద్ద బీసీ సామాజికవర్గీయుల సమావేశం.
5.25 – ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ.
5.55 – నవులూరు రోడ్డులో టూవీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
6.25 – యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రంలో బస.
******