CM Jagan: ఇంటర్ లో ఇంటర్నేషనల్ సిలబస్... విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
- విద్యాశాఖ మంత్రి బొత్స, ఉన్నత విద్యామండలి చైర్మన్ తో సీఎం సమావేశం
- ఇంటర్ లో ఐబీ సిలబస్ పై అధ్యయనం చేయాలన్న సీఎం జగన్
- ప్రపంచస్థాయి విద్యాబోధన లక్ష్యంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం
- ఏఐని విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచన
రాష్ట్ర విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా, ఇంటర్మీడియట్ లో ఇంటర్నేషనల్ బోర్డు (ఐబీ) సిలబస్ అంశంపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఇంటర్ సిలబస్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రపంచస్థాయి విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉద్యోగం సాధించేలా విద్యావిధానం ఉండాలని స్పష్టం చేశారు.
మన రాష్ట్రంలో ఒక విద్యార్థి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే విలువ ఉండాలని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని అధికారులకు వివరించారు.
దాంతోపాటే, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలు కల్పించేలా అంతర్జాతీయ విద్యాసమాజంలో ప్రపంచస్థాయి సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా కార్యాచరణ ఉండాలని సీఎం జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మెరుగైన ప్రమాణాలు సాధించేందుకు ఏఐని విస్తృతస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.