Retail Inflation: దేశంలో 15 నెలల గరిష్ఠానికి ఎగబాకిన చిల్లర ద్రవ్యోల్బణం
- జూన్ లో 4.87 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం
- జులైలో 7 శాతాన్ని దాటిన వైనం
- టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమే కారణం
- గతేడాది ఏప్రిల్ లో 7.79 శాతంగా నమోదైన చిల్లర ద్రవ్యోల్బణం
గత జులై నెలలో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగింది. 15 నెలల తర్వాత ఇదే అత్యధికం. జూన్ లో 4.87 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం జులై మాసంలో ఒక్కసారిగా పెరిగింది.
వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 నుంచి 6 శాతం మధ్య చిల్లర ద్రవ్యోల్బణాన్ని ఆరోగ్యకరమైనదిగా భావిస్తుంటుంది. ఇప్పుడది ఆర్బీఐ పేర్కొన్న దానిని మించిపోయింది.
జులైలో చిల్లర ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమే. గతంలో అత్యధిక చిల్లర ద్రవ్యోల్బణం 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా వెల్లడించింది.