Rajareddy: ప్రొద్దుటూరు పూజా స్కూల్ యజమాని మృతి కేసులో వీడిన మిస్టరీ
- ఇటీవల ప్రొద్దుటూరులో పూజా స్కూల్ యజమాని రాజారెడ్డి మృతి
- తమ్ముడు, మరదలే హంతకులు అని పోలీసుల వెల్లడి
- ఆస్తి తగాదాల కారణంగానే చంపేశారన్న ఏఎస్పీ
- స్కూలు ఆవరణలోనే గొంతు నులిమి చంపారని వివరణ
- గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని స్పష్టీకరణ
కడప జిల్లా ప్రొద్దుటూరులోని పూజా స్కూల్ యజమాని రాజారెడ్డి ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తెలిసిందే. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాజారెడ్డిని హత్య చేసినట్టు గుర్తించారు.
రాజారెడ్డిని తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు ప్రసన్న హత్య చేశారని ఏఎస్పీ ప్రేరణ్ కుమార్ వెల్లడించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని తెలిపారు. ఆగస్టు 11న రాజారెడ్డి హత్య జరిగిందని వివరించారు. పాఠశాల ఆవరణలోనే గొంతునులిమి హత్య చేశారని ఏఎస్పీ పేర్కొన్నారు.
రాజారెడ్డిని హత్య చేసి, అనారోగ్యం అంటూ ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. నిందితులకు డాక్టర్ వీరనాథరెడ్డి కూడా సహకరించారని, రాజారెడ్డికి గుండెపోటు వచ్చిందని ఆ డాక్టర్ చెప్పారని తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.