chennai women: స్కూలుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని బెదిరించిన తల్లి.. కాలు జారడంతో బిగుసుకున్న ఉరి.. చెన్నైలో మహిళ మృతి
- బెదిరించే ప్రయత్నంలో ప్రమాదం.. ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి
- కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో ఘటన
స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న కొడుకును బెదిరించి దారికి తెచ్చుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది. బెదిరింపే నిజంగా మారి కన్నబిడ్డకు దూరమైంది. స్కులుకు వెళ్లకుంటే ఉరేసుకుంటానని కొడుకు ముందు ఉరితాడు తగిలించుకుంది. ప్రమాదవశాత్తూ ఉరి బిగుసుకుపోవడంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంది. చుట్టుపక్కల వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తల్లి తుదిశ్వాస వదిలింది.
తమిళనాడు, కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పదహారు, పద్నాలుగేళ్ల వయసున్న కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలిద్దరూ సమీపంలోని పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, కొన్నిరోజులుగా స్కూలుకు వెళ్లేందుకు కొడుకు మారాం చేస్తుండడంతో యమునాబాబు మందలించింది. బాగా చదువుకోవాలని చాలాసార్లు చెప్పిచూసింది. ఎంతకీ వినని కొడుకును దారికితెచ్చుకోవడానికి ఉరేసుకుంటానని బెదిరించింది.
దీనిని కొడుకు తేలిగ్గా తీసుకోవడంతో యమునాబాబు ఉరితాడు బిగించి, మెడకు తగిలించుకుంది. ఆపై కొడుకును బెదిరిస్తుండగా కాలు జారడంతో యమునాబాబు మెడకు ఉరి బిగుసుకుంది. కొడుకు పరిగెత్తుకు వెళ్లి చుట్టుపక్కల వాళ్లను పిలుచుకు రాగా.. ఉరితాడుకు వేలాడుతున్న యమునాబాబును వారు కిందికి దించి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె ఆసుపత్రిలో చనిపోయింది. దీంతో అప్పనేకర్ రోడ్డులో విషాదం నెలకొంది.