Dhanush: తల్లి మరణంతో మారిపోయే ఒక కొడుకు కథే 'రఘువరన్ బీటెక్' .. ఈ నెల 18న రీ రిలీజ్!
- 2014లో విడుదలైన 'రఘువరన్ బీటెక్'
- ధనుశ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా
- హైలైట్ గా అనిపించే అమ్మపాట
- ఈ నెల 18వ తేదీన రీ రిలీజ్
గతంలో హిట్ కొట్టిన సినిమాలను రీ రిలీజ్ చేయడం ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలు టీవీల్లో చాలాసార్లు ప్రసారమైనా, థియేటర్స్ లో రీ రిలీజ్ చేసినప్పుడు మంచి వసూళ్లను రాబడుతూ ఉండటం విశేషం. అలా ఈ నెల 18వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు రావడానికి 'రఘువరన్ బీటెక్' రెడీ అవుతోంది. ధనుశ్ - అమలా పాల్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిన ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించాడు.
2014లో విడుదలైన ఈ సినిమా విషయానికొస్తే .. అమ్మా .. నాన్న .. ఒక తమ్ముడు .. ఇది రఘువరన్ కుటుంబం. తమ్ముడు కార్తీక్ జాబ్ చేస్తూ ఉంటాడు. రఘువరన్ కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టడు .. అందువలన తండ్రితో తరచూ చీవాట్లు తింటూ ఉంటాడు. అతనికి తల్లి అంటే చాలా ఇష్టం .. కానీ ఆమె చెప్పే మాటలను లైట్ తీసుకుంటూ ఉంటాడు. అలాంటి తల్లి చనిపోవడానికి అతను పరోక్షంగా కారణమవుతాడు. ఆ పశ్చాత్తాపం అతని పద్ధతిని మార్చేస్తుంది. జీవితంలో సవాళ్లను తట్టుకుని ఎదిగేలా చేస్తుంది.
'అమ్మా .. అమ్మా నే పసివాణ్ణమ్మా' అంటూ సాగే ఈ సినిమాలోని పాట, అమ్మ పాటల్లో ముందువరసలో నిలుస్తుంది. అమ్మలేని ప్రతి ఒక్కరినీ కదిలించే పాట ఇది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో నడిచే ఈ కథ .. ప్రతి ఇంటి కథలా అనిపిస్తుంది. యూత్ కి వినోదాన్ని పంచిన సినిమాగానే కాదు, వాళ్లలో స్ఫూర్తిని కలిగించే కథగా కూడా కనిపిస్తుంది.