Lakshita: తిరుమల నడక దారిలో చిరుతకు బలైన బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
- అలిపిరి మార్గంలో లక్షిత అనే బాలికను లాక్కెళ్లిన చిరుత
- ఈ ఉదయం సగం తినేసిన స్థితిలో లక్షిత మృతదేహం లభ్యం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీటీడీ
- టీటీడీ రూ.5 లక్షలు, అటవీశాఖ రూ.5 లక్షల పరిహారం
తిరుమల నడక దారిలో గతంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన కలకలం సద్దుమణిగిందో లేదో, ఈసారి ఏకంగా ఓ బాలికను చిరుత బలిగొనడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిరుత దాడిలో మృతి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. అటవీశాఖ నుంచి కూడా మరో రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించింది.
శుక్రవారం రాత్రి తిరుమల కొండపైకి అలిపిరి మార్గం ద్వారా కాలినడకన వస్తున్న సమయంలో చిరుత లక్షితపై దాడి చేసి అడవిలోకి ఈడ్చుకుపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా, ఉదయం అలిపిరి నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక మృతదేహం సగభాగం లభ్యమైంది. సగభాగాన్ని చిరుత తినేసి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో బాలిక మృతి చెందడం బాధాకరమని అన్నారు. గతంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను వెంటనే పట్టుకున్నామని, ఈ చిరుతను కూడా అదే రీతిలో బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తిరుమల నడకదారిలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, నడక మార్గంలో పోలీసులు, అటవీశాఖ పోలీసులు, టీటీడీ కలిసి పటిష్ఠమైన భద్రత కల్పించే చర్యలు తీసుకుంటున్నట్టు ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమల నడక దారుల్లో భక్తులను అనుమతించే సమయం కుదించడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. నడక మార్గాల్లో ప్రతి 40 అడుగులకు భద్రతా సిబ్బందిని నియమించడంపై చర్యలు తీసుకుంటామని వివరించారు.