BNS: యువరానర్! ఐపీసీ కాదు.. బీఎన్ఎస్.. భారతీయ శిక్షా స్మృతిలో భారీ మార్పులు.. ఏ నేరానికి ఏ శిక్ష?
- బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ ఇక కనుమరుగు
- దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత
- సీపీఆర్‌సీకి బదులు బీఎన్ఎస్
- మైనర్లపై అత్యాచారాలకు ఇక ఉరే
- చిన్నచిన్న నేరాలకు సామాజిక సేవ శిక్ష
- సంస్థాగత నేరాలకు జీవిత ఖైదు
- మూకహత్యలకు పాల్పడితే మరణశిక్ష
- 356కు తగ్గిపోతున్న 511 సెక్షన్లు
- 18 ఏళ్లు దాటిన వ్యక్తి భార్యతో లైంగిక చర్యకు పాల్పడితే అత్యాచారం కాదు
- ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా
బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) ఇక కనుమరుగు కానుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్‌లను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెక్షన్లు కూడా పూర్తిగా మారిపోతాయి. అంటే ఐపీసీకి బదులుగా ‘భారతీయ న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వస్తుందన్నమాట. ఇకపై న్యాయమూర్తులు ఐపీసీకి బదులుగా బీఎన్ఎస్ అని పేర్కొంటారు. ఈ మేరకు నిన్న పార్లమెంటులో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది.
అలాగే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)కి బదులుగా ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) అమల్లోకి రానుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ (బీఎస్) రానుంది. దీంతో పాటు సెక్షన్లు కూడా మారిపోనున్నాయి. ఇప్పటి వరకు హత్యానేరాన్ని ఐపీసీ సెక్షన్ 302 కింద నమోదు చేస్తుండగా ఇకపై అది బీఎన్ఎస్ 99గా మారనుంది.
సెక్షన్ 124ఏ పూర్తిగా రద్దు
రాజద్రోహం (దేశ ద్రోహం) చట్టాన్ని (సెక్షన్ 124ఏ) కేంద్రం పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో సెక్షన్ 150ని తీసుకొచ్చింది. ఈ సెక్షన్ కింద నేరాలకు గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు. అలాగే, మూక హత్యలకు మరణశిక్ష, మైనర్లపై అత్యాచారాలకు ఉరిశిక్ష, సామూహిక అత్యాచారానికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ మూడేళ్లలోపే న్యాయం అందుతుంది. అలాగే, చిన్నచిన్న నేరాలకు పాల్పడే వారికి సామాజిక సేవ శిక్ష విధించాలని తొలిసారి ప్రతిపాదించారు.
అందరినీ సంప్రదించాకే..
బ్రిటిష్ చట్టాల ముఖ్య ఉద్దేశం శిక్షించడమే తప్ప న్యాయం అందించడం కాదని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు. వర్తమాన అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాజాగా మార్పులతో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇకపై ఎఫ్ఐఆర్ నుంచి కేసు డైరీ వరకు, చార్జ్‌షీట్ నుంచి న్యాయం వరకు అన్నీ డిజిటలైజ్ అవుతాయని పేర్కొన్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 22 న్యాయ విశ్వవిద్యాలయాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలను సంప్రదించిన తర్వాతే ఈ మూడు బిల్లుల ముసాయిదాలు రూపొందించినట్టు వివరించారు.
నేరము.. శిక్ష
అత్యాచారం నిందితులకు కనీసం పదేళ్లు, గరిష్ఠంగా జీవితఖైదు విధిస్తారు. సామూహిక అత్యాచారాలకు కనీసం 20 ఏళ్లు, లేదంటే జీవించి ఉన్నంత వరకు కారాగారం విధిస్తారు. అత్యాచార బాధితులు మరణించినా, కోమాలోకి వెళ్లినా నిందితుడికి గరిష్ఠంగా 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. జీవిత ఖైదుకు కూడా పెంచే అవకాశం ఉంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికపై అత్యాచారాలకు పాల్పడితే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. మరణశిక్ష కూడా విధించవచ్చు.
ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారి, సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనీసం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. జీవిత ఖైదుకు కూడా మార్చవచ్చు. పురుషుడు 18 ఏళ్లు దాటిన భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందికి రాదు. ఎన్నికల నేరాలకు కూడా శిక్షలున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం నేరంగా భావిస్తారు. ఓటర్లకు ఇచ్చే హామీని బహిరంగంగా ప్రకటించడం నేరం కాదు.
సంస్థాగత నేరాలకు పాల్పడినా, అందుకు ప్రయత్నించినా, దానివల్ల ఎవరైనా మరణించినా మరణశిక్ష, లేదంటే జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే, రూ. 10 లక్షల జరిమానా కూడా చెల్లించుకోవాలి. ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, దానివల్ల మరణాలు సంభవించినా మరణశిక్ష లేదంటే పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు విధిస్తారు. రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించవచ్చు. కులం, భాష, వర్ణం, లింగం, పుట్టిన స్థలం, వ్యక్తిగత విశ్వాసాలతో ఐదుగురికు మించి బృందంగా ఏర్పడి నేరచర్యకు పాల్పడితే దానిని మూకహత్యగా భావించి గరిష్ఠంగా మరణశిక్ష విధిస్తారు. అలాగే, ప్రస్తుతం ఐపీసీలో ఉన్న 511 సెక్షన్లు రాబోయే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో 356కు తగ్గుతాయి.