Pawan Kalyan: తెలంగాణ వారు తన్ని తరిమేస్తే జగన్ ఉత్తరాంధ్రపై పడ్డాడు: పవన్ కల్యాణ్ తీవ్రవ్యాఖ్యలు

Pawan Kalyan fires at YS Jagan after Rishi Konda visit

  • మీడియా కూడా ఈ అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలన్న పవన్ 
  • తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు.. ఉత్తరాంధ్రలో ఆగాలి
  • వరదలు, తుపానులు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుందని వెల్లడి 
  • కిర్లంపూడిలో ఓ మూలకు కూర్చోకుండా ఇక్కడ సీఎం కార్యాలయం అవసరమా? అంటూ ఎద్దేవా 

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆయనే వాటిని ఉల్లంఘిస్తున్నారని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం జనసేనాని విశాఖలోని రుషికొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొండపైకి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రుషికొండ వద్దకు నడుచుకుంటూ వెళ్లడానికి జనసేనాని ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు వద్ద నుండి చూడాలని సూచించారు. దీంతో అక్కడి నుండే పరిశీలించారు. కొండను తవ్వడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆయనే ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. విపక్షాలు, ఇతరులు ఎవరైనా శాంతియుతంగా చిన్న నిరసన తెలిపినా అరెస్టు చేస్తారని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం కొండను తవ్వినా ఏం కాదా? అన్నారు. తెలంగాణను ఇలాగే దోపిడీ చేస్తే తన్ని తరిమేశారని, ఇప్పుడు ఉత్తరాంధ్రపై కన్నుపడిందన్నారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా రుషికొండ కాపాడుతుందన్నారు. వీరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దోచేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే దోపిడి ఇలాగే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ఇల్లు సరిపోదా? ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నారు. కిర్లంపూడి లేఔట్ తాకట్టు పెట్టి, ఇక్కడ అవసరమా? అన్నారు. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి ఉందా? చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కోసం ఇలా చేయాలా? ఓ మూలకు కూర్చోకుండా అద్భుతంగా కనిపించడం కోసం ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం కావాలా? అని ప్రశ్నించారు. కిర్లంపూడిలో క్యాంప్ కార్యాలయం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. తెలంగాణను దోచింది చాలక ఉత్తరాంధ్ర మీద పడ్డారన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉంటారని చెప్పి, ఉత్తరాంధ్రను దోపిడీ చేయాలనుకోవడం తప్పన్నారు. ఈ అక్రమాన్ని, అన్యాయాన్ని మీడియా కూడా ప్రజలకు చెప్పాలన్నారు. ఈ అక్రమాన్ని తాను వెలికి తీసుకు వస్తున్నానని, తానొక్కడినే చేయడం కాదని, అందరూ ప్రజలకు చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో దోపిడీ ఆగిపోవాలన్నారు. మూడు రాజధానులు అంటారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రాజధానికే దిక్కు లేదన్నారు.

Pawan Kalyan
YS Jagan
Andhra Pradesh
Visakhapatnam
rishi konda
  • Loading...

More Telugu News