happy life: ఇలా చేస్తే నూరేళ్లు హ్యాపీ.. 101 ఏళ్ల న్యూరాలజిస్ట్ చెబుతున్న సూత్రాలు

101 year old neurologist shares his 4 keys to a long and happy life

  • చేసే పనికి రిటైర్మెంట్ వద్దు
  • వృద్ధాప్యం వచ్చేసందని భావించొద్దు
  • యువకుడిననే అనుకుంటూ పనిచేసుకోవాలి
  • చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలు అవసరం

శతాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అనే దీవెనలు వినే ఉంటారు. దీర్ఘకాలం జీవించడం ఒక్కటే కాదు.. జీవితాంతం సంతోషంగా ఉండాలి. అందుకు ఏం చేయాలన్నది డాక్టర్ హోవర్డ్ టక్కర్ చెబుతున్నారు. ఆయన అమెరికాలోని ఓహియో పట్టణంలో 1922 జులై 10న జన్మించారు. న్యూరాలజిస్ట్ గా ఎన్నో ఆసుపత్రుల్లో పనిచేశారు. తన వద్ద వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. ఆమె వయసు 66 ఏళ్లు. వారికి నలుగురు పిల్లలు, 10 మంది మనవళ్లు, మనవరాళ్లు, వారి తర్వాతి సంతతి ఉన్నారు. తాను అన్నేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా ఉన్నానో, అందుకు ఏం చేశానన్నది వివరంగా చెప్పారు.

రిటైర్మెంట్ వద్దు..
ఉద్యోగంలో 58 లేదా 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది. వృత్తి జీవితాన్ని కూడా 60 దాటిన తర్వాత ఏదో ఒక వయసులో నిలిపివేస్తారు. కానీ, టక్కర్ తన పని జీవితానికి విరామం ప్రకటించలేదు. ప్రతి రోజూ ఆసుపత్రికి వెళ్లి ఉదయం రోగులను చూడాల్సిందే. మధ్యాహ్నం వరకు ఆసుపత్రిలో పనిచేసిన తర్వాత.. సాయంత్రం టీవీ చూడడం.. లేదంటే చదవడం అలవాటు. మార్టిని అనే ద్రవాన్ని తాగుతారు. దీర్ఘాయుష్షుకు రిటైర్మెంట్ శత్రువు అని ఆయన నమ్ముతారు. అదే సమయంలో వృద్ధాప్యం మీద పడ్డా, తాము చేసే పని పట్ల మక్కువ ఉంటేనే దాన్ని కొనసాగించగలరని చెప్పారు.

వృద్ధాప్య భావనలు వద్దు
వయసు మీద పడిందని, పడుతుందని ఆలోచిస్తే ఏమొస్తుంది? నీరసం తప్ప? టక్కర్ అలా కాదు. వయసు గురించి ఆలోచించరు. తాను ఇంకా యువకుడినేనని భావిస్తుంటారు. ట్రెక్కింగ్ కు వెళుతుంటారు. అలా తనను ఉద్రేకపరిచే, ఆనందాన్నిచ్చే పనులు చేస్తుంటారు. తన స్నేహితులు తన కంటే ముందుగానే మరణించడాన్ని ఆయన మర్చిపోరు. ‘‘మరణం అంటే భయం లేదు. నేను చాలా దీర్ఘకాలం పాటు జీవించి ఉంటానని ఎప్పుడూ అనుకుంటాను ’’అని చెప్పారు. అదే సానుకూల దృక్పథం. 

చురుకుదనం
ఇక పనేమీ లేదని అలా కూర్చోవడం, నిద్రపోవడం వంటివి చేస్తే నిష్ప్రయోజనమే. వ్యాయామం తప్పకుండా చేయడం టక్కర్ దినచర్యలో భాగంగా ఉంటుంది. బయట పరుగెత్తడం వయసు రీత్యా సురక్షితం కాదని, ఇంట్లోనే ట్రెడ్ మిల్ పై చేస్తారు. వారంలో పలు సందర్భాలు రెండు నుంచి మూడు మైళ్ల పాటు రోజూ నడుస్తారు. 

మంచి సంబంధాలు
ఇక టక్కర్ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతున్న అంశాల్లో.. నలుగురితో మంచి సంబంధాలు కూడా ఒకటిగా చెప్పుకోవాలి. కుటుంబం పెద్దది కావడంతో అందరితో సరదాగా, కలసి మెలిసి ఉంటారు. తన కంటే చిన్న వయసులోని స్నేహితులతోనూ సమయాన్ని గడుపుతారు. ‘‘ద్వేషించడాన్ని మనం విడిచి పెట్టాలి. ఎందుకంటే అది టెన్షన్ తీసుకొచ్చి పెడుతుంది. ఎదుటి వారిని జడ్జ్ చేస్తూ కూర్చుంటే సమయం వృథా’’ అని చెబుతారు. చివరిగా.. ప్రపంచంలో అది పెద్ద వయసులోనూ వైద్య వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తిగా టక్కర్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది.

  • Loading...

More Telugu News