taali web series: ట్రాన్స్ జెండర్ గా సుస్మితా సేన్ వెబ్ సిరీస్ 'తాళి'.. ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్

Bollywood Actress Sushmita Sen set to fight for Indias third gender

  • ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం
  • పూణె ట్రాన్స్ జెండర్ శ్రీగౌరీ జీవిత కథ ఆధారంగా నిర్మాణం
  • హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘తాళి’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ట్రాన్స్ జెండర్ శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్ ను నిర్మించారు. జాతీయ అవార్డు దర్శకుడు రవిజాదవ్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీగౌరి పాత్రను సుస్మితాసేన్ పోషిస్తున్నారు. ట్రైలర్ లో సుస్మిత నటన ఆకట్టుకుంటోంది. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాటం, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో పలు ఓటీటీల్లో తాళి స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు.

శ్రీగౌరితో పాటు ట్రాన్స్ జెండర్లు నిజజీవితంలో ఎదుర్కొన్న పలు సంఘటనల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ ను తీర్చిదిద్దినట్లు డైరెక్టర్ రవిజాదవ్ తెలిపారు. పూణెలో జన్మించిన శ్రీగౌరీ.. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం అలుపెరగని కృషి చేశారు. సఖీ చార్‌ చౌఘి ట్రస్ట్ స్థాపించి తోటి ట్రాన్స్ జెండర్లకు అండగా నిలిచారు. న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం వల్లే 2014లో ట్రాన్స్ జెండర్లను థర్డ్ జెండర్ గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ట్రాన్స్ జెండర్ పాత్ర పోషించేందుకు తాను చాలా రీసెర్చ్ చేశానని, ఈ పాత్ర కోసం సన్నద్దమవడానికి తనకు ఆరున్నర నెలల సమయం పట్టిందని సుస్మితాసేన్ చెప్పారు. శ్రీగౌరి సావంత్ ను కలిసి ఆమెతో కొన్నిరోజులు ఉండడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు వివరించారు. శ్రీగౌరి పాత్రలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సుస్మితాసేన్ చెప్పారు. కాగా, ట్రాన్స్ జెండర్ల విషయంలో ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ వెబ్ సిరీస్ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు శ్రీగౌరి సావంత్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News