Cricket: క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకం ఎప్పటి నుంచంటే..!
- ఆగస్టు 15 నుంచి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ షురూ
- అదేరోజు రివైజ్డ్ షెడ్యూల్ కూడా విడుదల.. వెల్లడించిన ఐసీసీ
- టికెట్ల వివరాలు, అప్ డేట్ల కోసం వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలని సూచన
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ కు ఈ నెల 25 నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. మ్యాచ్ ల షెడ్యూల్ (అప్ డేటెడ్) ను కూడా అదేరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలకు సంబంధించిన అప్ డేట్ల కోసం ఐసీసీ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలని అభిమానులకు సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ జరపడంలేదని ఐసీసీ స్పష్టం చేసింది. కౌంటర్ ద్వారా ప్రత్యక్షంగానే అమ్మకాలు జరుపుతామని వివరించింది. వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన క్రికెట్ అభిమానులకు టికెట్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలు అందరికన్నా ముందే అందుతాయని, టికెట్ దక్కించుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఐసీసీ పేర్కొంది. ప్రతీ మ్యాచ్ కు బీసీసీఐకి 300 టికెట్లు, లీగ్ దశలో జరిగే ప్రతీ మ్యాచ్ కు ఐసీసీకి 1295 టికెట్లు, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య జరిగే మ్యాచ్ లతో పాటు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు 1355 టికెట్లు కేటాయించాలని తెలిపింది.
మ్యాచ్ ల షెడ్యూల్ లో మార్పులు ఇవే..
అక్టోబర్ 10న ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ల మధ్య ధర్మశాలలో ఉదయం 10:30 గంటలకు మ్యాచ్,
అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో పాకిస్థాన్, శ్రీలంకల మధ్య
అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల మధ్య లక్నోలో మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 13న చెన్నై వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ల మధ్య మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఇండియా, పాకిస్థాన్
అక్టోబర్ 15న ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఢిల్లీలో మధ్యాహ్నం 2 గంటలకు
నవంబర్ 11న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ల మధ్య పూణే వేదికగా ఉదయం 10:30 గంటలకు
నవంబర్ 11న ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య కోల్ కతాలో మధ్యాహ్నం 2 గంటలకు
నవంబర్ 12న ఇండియా, నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ లు జరగనున్నాయి.