Nandigama: బిడ్డల కోసం 20 ఏళ్ల పాటు తపన.. ముగ్గుర్ని ప్రసవించిన కొన్ని రోజులకే మహిళ మృతి
- ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాద ఘటన
- 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తపించి తల్లయిన మహిళ
- ఆసుపత్రిలో ముగ్గురు బిడ్డలకు జననం
- ప్రసవం తరువాత కొన్ని రోజులకే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి
- తీవ్ర విషాదంలో కూరుకుపోయిన మహిళ కుటుంబం
బిడ్డల కోసం ఆ మహిళ ఏకంగా 20 ఏళ్ల పాటు తపించింది. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చింది. కానీ, ఇంతలోనే ఆ కుటుంబాన్ని విధి కర్కశంగా కాటేసింది. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డల బోసినవ్వులు కూడా చూడకుండానే తనువు చాలించింది.
నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసిం ఆటో డ్రైవర్. ఆ దంపతులు పిల్లల కోసం రెండు దశాబ్దాల పాటు తపించాక నజీరా గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది. పదిరోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.
మరోవైపు, నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. పిల్లల కోసం తపించిన ఆమె వారిని కళ్లారా చూసుకోకుండానే కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. బుధవారం కుటుంబసభ్యుల రోదనల నడుమ ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. తన స్థాయికి మించి ఖర్చు చేసినా బిడ్డలు తల్లిలేని వారు కావడంతో ఖాసిం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు. బిడ్డలైనా తనకు దక్కాలని భగవంతుడిని వేడుకుంటున్నాడు.