Parliament: మణిపూర్ లో భారత మాతను చంపేశారు.. లోక్ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Rahul Gandhi speech in Parliament on No Confidence Motion

  • అవిశ్వాస తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రసంగం
  • అదానీ గురించి మాట్లాడను మీరు భయపడొద్దంటూ కౌంటర్
  • భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని లోక్ సభలో వెల్లడి

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం లోక్ సభలో చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలు కాగా.. ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించారు. గత సమావేశాల్లో తాను అదానీ గురించి మాట్లాడితే సభలో చాలామంది సభ్యులకు ఆవేదన కలిగిందని రాహుల్ ఎద్దేవా చేశారు. 

అయితే, ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలు భయపడాల్సిన అవసరంలేదని, తాను అదానీ గురించి మాట్లాడబోవడంలేదని అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓవైపు బీజేపీ నేతల నినాదాలు కొనసాగుతుండగానే రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల తాను చేసిన భారత్ జోడో యాత్రను సభలో ప్రస్తావిస్తూ.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని తనను చాలామంది అడిగారని రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత్ జోడో యాత్ర వెనక తన లక్ష్యం ఏంటని అడిగారని చెప్పారు. భారత దేశాన్ని చూసేందుకు, ప్రజలను కలిసేందుకు, దేశాన్ని, ప్రజలను మరింతగా అర్థం చేసుకునేందుకే యాత్ర చేస్తున్నానని తాను వారికి జవాబిచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ చెప్పారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండేనని రాహుల్ గాంధీ లోక్ సభలో స్పష్టం చేశారు. మణిపూర్ కూడా భారత్ లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అక్కడి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చాలని సూచించారు. ఇటీవల తాను మణిపూర్ వెళ్లానని రాహుల్ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకూ వెళ్లలేదని, ఎందుకంటే వారి దృష్టిలో మణిపూర్ మన దేశంలో భాగం కాదని ఆరోపించారు. మణిపూర్ ను కేంద్ర ప్రభుత్వం రెండుగా చీల్చిందని, అక్కడ భారత మాతను చంపేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 

మణిపూర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల క్యాంపులో మహిళలను, చిన్నారులను కలిశానని రాహుల్ గాంధీ చెప్పారు. ఓ మహిళ తనతో మాట్లాడుతూ.. తను ఎదుర్కొన్న దారుణమైన కష్టాలను చెప్పుకుందని వివరించారు. తనకు ఒక్కడే కొడుకని, ఆ కొడుకును తన కళ్ల ముందే కాల్చి చంపారని చెబుతూ కన్నీటి పర్యంతమైందని రాహుల్ చెప్పారు. రాత్రంతా తన కొడుకు మృతదేహం వద్దే ఉన్నానని, తెల్లవారాక భయంతో కట్టుబట్టలతోనే అక్కడి నుంచి వచ్చేశానని చెప్పిందన్నారు. తన దగ్గర ఇప్పుడు కేవలం ఈ బట్టలు మాత్రమే మిగిలాయని, సర్వం కోల్పోయానని తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. భారత సైన్యం రంగంలోకి దిగితే మణిపూర్ లో శాంతిని నెలకొల్పడం కేవలం ఒక్కరోజులోనే సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లో శాంతి నెలకొనడం ఇష్టంలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.



  • Loading...

More Telugu News