UK: బ్రిటన్ వీసాలు పొందిన ఐరోపాయేతర వైద్య రంగ నిపుణుల్లో భారతీయులే టాప్
- ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మైగ్రేషన్ అబ్జర్వేటరీ తాజా నివేదికలో వెల్లడి
- ఐరోపాయేతర వైద్యుల్లో 20 శాతం, నర్సుల్లో 46 శాతం భారతీయులే
- భరత్ తరువాతి స్థానాల్లో వరుసగా నైజీరియా, పాకిస్థాన్
గతేడాది బ్రిటన్ స్కిల్డ్ వర్క్ వీసాలు పొందిన హెల్త్ కేర్ వర్కర్లలో అత్యధికులు ఐరోపాయేతర దేశాల నుంచి వచ్చిన వారేనని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మైగ్రేషన్ అబ్జర్వేటరీ తాజాగా రూపొందించిన నివేదికలో తేలింది. వీరిలోనూ భారతీయులే అత్యధిక వీసాలతో(99 శాతం) ముందు వరుసలో ఉన్నారని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో వీదేశీ వైద్య రంగ సిబ్బంది బ్రిటన్‌కు తరలివచ్చారని చెప్పింది.
ఈ నివేదిక ప్రకారం, స్కిల్డ్ వర్క్ వీసా పొందిన ఐరోపాయేతర విదేశీ వైద్య రంగ నిపుణుల్లో 20 శాతం వైద్యులు 46 శాతం నర్సులు భారతీయులే. ఫలితంగా భారత్ నెం.1 స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. గతేడాది సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఆధారిత పౌరసత్వం పొందిన కార్మికుల పరంగానూ భారత్(33 శాతం) టాప్‌లో నిలిచింది. 2017 నుంచీ బ్రిటన్‌లో హెల్త్ కేర్ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది. దీంతో, వర్క్ వీసా ద్వారా బ్రిటన్‌కు విదేశీ నిపుణుల రాకడ పెరిగింది.
యూకే నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2021-22లో విదేశీ నిపుణుల రాక గణనీయంగా పెరిగింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 57,700 మంది హెల్త్ వర్కర్లు స్కిల్డ్ వర్కర్ వీసాలు పొందారు. గతేడాది బ్రిటన్‌లోకి వలసలు అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగినట్టు తేలింది.