Nara Lokesh: ఆ మందు విషం కంటే ప్రమాదం: నారా లోకేశ్
- గురజాల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- పిడుగురాళ్లలో యువగళం సభ
- భారీగా తరలివచ్చిన జనాలు
- ఒక్కొక్కరిపై జే ట్యాక్స్ రూ.45 వేలన్న లోకేశ్
- జే బ్రాండ్ల లిక్కర్ తాగి వేలమంది చనిపోతున్నారని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో విశేష ప్రజాదరణ అందుకుంది. జూలకల్లు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలనుంచి స్పందన లభించింది.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని నేతృత్వంలో 101 మంది మహిళలు కలశాలతో లోకేశ్ కు స్వాగతం పలుకగా, వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పిడుగురాళ్ల కన్యకాపరమేశ్వరి గుడివద్ద జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు.
పిడుగురాళ్ల సభలో లోకేశ్ ప్రసంగం హైలైట్స్...
గురజాలగడ్డపై పాదయాత్ర అదృష్టం
గురజాల ప్రజల గుండెల నిండా ధైర్యం ఉంటుంది. దళితుడైన మాల కన్నమదాసుని సర్వ సైన్యాధ్యక్షుడుని చేసి గౌరవించిన నేల గురజాల. యుద్దానికి వెళ్తున్న భర్తకు వీర తిలకం దిద్ది సాగనంపిన మగువ మాంచాల పుట్టిన ప్రాంతం గురజాల.
దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారు, శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయాలు ఉన్న పుణ్యభూమి గురజాల. ఘన చరిత్ర ఉన్న గురజాల గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
ఒక్కొక్కరిపై రూ.45 వేల జే-ట్యాక్స్
జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి, ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేస్తున్నాడు. జగన్ రోజూ ఏం తాగుతాడు? ఆప్షన్1. బూమ్ బూమ్. ఆప్షన్2. ప్రెసిడెంట్ మెడల్. ఆప్షన్3. ఆంధ్రా గోల్డ్. ఆప్షన్4. ప్రజల రక్తం.
రోజుకి క్వార్ట్రర్ తాగే వాళ్ల దగ్గర నుండి జగన్ ఎంత కొట్టేస్తున్నాడో తెలుసా? క్వార్ట్రర్ పై రూ.25 రూపాయలు. నెలకి రూ. 750, ఏడాదికి రూ. 9 వేలు, 5 ఏళ్లకు ఎంత? రూ.45 వేలు. రోజుకి క్వార్ట్రర్ తాగే వ్యక్తి జగన్ కి కడుతున్న జే ట్యాక్స్ రూ.45 వేలు.
ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ గురించి నేను చెప్పడం లేదు. మీ రక్తం తాగుతూ జగన్ దొబ్బుతున్న సొమ్ము గురించి చెబుతున్నా.
జే బ్రాండ్ లిక్కర్ తాగి వేలమంది చనిపోతున్నారు!
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. కానీ గెలిచిన తరువాత సొంత లిక్కర్ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచాడు. అంత కంటే డేంజర్ ఏంటో తెలుసా జగన్ మందు విషం కంటే ప్రమాదం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రికైనా వెళ్లి డేటా తీసుకోండి.
గత నాలుగేళ్లలో జే బ్రాండ్ లిక్కర్ తాగి చనిపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. జే బ్రాండ్ లిక్కర్ లో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ దెబ్బకి బాడీ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. మహిళల తాళిబొట్లు తెంచుతున్నావ్, పసుపు కుంకుమ చెరిపేస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు జగన్.
గురజాలను అభివృద్ధి చేసింది టీడీపీ!
గురజాలను అభివృద్ధి చేసింది టీడీపీ. 2014 నుండి 2019 వరకూ రూ.2,265 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది గురజాల సింహం యరపతినేని శ్రీనివాస్.
రూ.336 కోట్లతో 6 వేల టిడ్కో ఇళ్లు, రూ.216 కోట్లతో ఎన్టీఆర్ గృహాలు, రూ.220 కోట్లతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ భవనాలు, రూ.170 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, గురజాల, పిడుగురాళ్ల పట్టణాల అభివృద్ధి, రూ.160 కోట్లతో పుష్కర ఘాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు పడుతుంది.
మాఫియాలకు అడ్డగా మార్చిన మహేశ్
గురజాలను అభివృద్ధి చేస్తారని మీరు భారీ మెజారిటీతో కాసు మహేశ్ రెడ్డిని గెలిపించారు. ఆయన చేసింది ఏంటి? గురజాలకి గుండు కొట్టాడు. అతని అవినీతి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత పేరు మార్చాను. కాసు మహేశ్ కాదు క్యాష్ మహేశ్. అక్రమ మైనింగ్ లో వెయ్యి కోట్లు కొట్టేశాడు క్యాష్ మహేశ్.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి రూ.200 కోట్లు సంపాదించాడు. నరసరావుపేటలో రూ.400 కోట్లతో భారీ షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, హైదరాబాద్ గచ్చిబౌలిలో రూ.500 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. నరసరావుపేట ములకలూరులో 100 ఎకరాలు కొట్టేశాడు.
క్యాష్ మహేశ్ దోపిడీకి బలైన వాళ్లెందరో!
దోపిడీలో జూనియర్ జగన్ ఈ క్యాష్ మహేశ్. గురజాలలో క్యాష్ మహేశ్ అరాచకాలకు సామాన్యులు బలైపోయారు. క్యాష్ మహేశ్ మైనింగ్ దందాకి 8 మంది పిల్లలు బలైపోయారు. మైనింగ్ గుంతల్లో పడి 8 మంది పిల్లలు చనిపోయారు.
11 మంది టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని దారుణంగా చంపించాడు ఈ క్యాష్ మహేశ్. అందులో ఇద్దరు దళితులు, 1 గిరిజనుడు, ముగ్గురు బీసీలు, ముగ్గురు మైనార్టీలు ఉన్నారు. కేవలం 9 నెలలు ఓపిక పట్టండి, క్యాష్ మహేశ్ ని క్యాట్ మహేశ్ .. పిల్లి మహేష్ గా మార్చే బాధ్యత నాది.
వైసీపీ నాయకులు కబ్జాచేసిన ఆస్తులు వెనక్కి!
పిడుగురాళ్లలో వైశ్య సోదరులకు చెందిన ఆస్తులను వైసీపీ నాయకులు కబ్జా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు మీకు తిరిగి ఇప్పిస్తాం. కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటాం.
పిడుగురాళ్ల చిప్స్ మిల్లులు, పల్వరైజింగ్ మిల్లుల యజమానులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది. నోటీసులు, కేసులు అంటూ వేధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులన్నీ ఎత్తేస్తాం. పల్నాడులో వడ్డెర కార్మికులను క్వారీ యజమానులుగా చేస్తాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2373.7 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 19.6 కి.మీ.*
*179వరోజు (9-8-2023) యువగళం వివరాలు*
*గురజాల అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*
ఉదయం
8.00 – పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – పాదయాత్ర సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
8.45 – కొండమోడులో స్థానికులతో సమావేశం.
10.45 – అనుపాలెంలో స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం
12.15 – చౌటపాపాయపాలెంలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – చౌటపాపాయపాలెం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – చౌటపాపాయపాలెంలో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
6.15 – పాదయాత్ర పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
7.15 – నాగిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం.
7.30 – బెల్లంకొండలో బుడగజంగాలతో సమావేశం.
8.15 – మాచాయపాలెంలో స్థానికులతో సమావేశం.
10.15 – మాచాయపాలెం విడిదికేంద్రంలో బస.
******