Chandrababu: సీఎం జగన్ ను పట్టుకొచ్చి తాడుకు కట్టేసి ఆ రోడ్డుపై నడిపించాలి... అప్పుడు తెలుస్తుంది: చంద్రబాబు
- పురుషోత్తపట్నం నుంచి కోరుకొండ చేరుకున్న చంద్రబాబు
- కోరుకొండలో భారీ బహిరంగ సభ
- దళిత ద్రోహి జగన్ ను చిత్తుగా ఓడించాలని పిలుపు
- పురుషోత్తపట్నం వెళ్లే దారి అధ్వానంగా ఉందని వెల్లడి
- ధైర్యం ఉంటే కోరుకొండ రా... తేల్చుకుందాం అంటూ సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పరిశీలన అనంతరం కోరుకొండ చేరుకున్నారు. తన సభ నేపథ్యంలో కరెంటు కట్ చేశారంటూ ఆరోపించారు.
ఓ దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును సీఎం జగన్ పక్కనబెట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతమంది దళితులను చంపుతారంటూ, గత కొంతకాలంగా జరిగిన సంఘటనలను చంద్రబాబు ప్రస్తావించారు. తాను దళితుల కోసం తీసుకువచ్చిన 27 పథకాలను సీఎం జగన్ రద్దు చేశాడని ఆరోపించారు. దళితులకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని, దళిత ద్రోహి జగన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
"ఇవాళ నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కోసం. ఈ మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అన్నీ వివరించాను. పోలవరాన్ని ఏ విధంగా ముంచేశాడో చెప్పాను.
ఈ సాయంత్రం పురుషోత్తపట్నం బయల్దేరాను. ఆ దారి చూశారా తమ్ముళ్లూ... ఎంత అందంగా ఉందో! ఈ జగన్ మోహన్ రెడ్డిని పట్టుకొచ్చి తాడుకు కట్టేసి రాజమండ్రి నుంచి ఆ రోడ్డుపై నేరుగా నడిపించుకుంటూ పోతే అప్పుడు బుద్ధొస్తుంది.
విమానాల్లో, హెలికాప్టర్లలో తిరగడం కాదు... పరదాలు కట్టుకుని తిరగడం కాదు... ధైర్యం ఉంటే రా... ఈ రాజానగరంలో, ఈ కోరుకొండలో ఇక్కడే మీటింగ్ పెడదాం... ప్రజల్లో తేల్చుకుందాం" అంటూ సవాల్ విసిరారు.