Kodali Nani: పకోడీగాళ్లు సలహాలిస్తున్నారు.. చిరంజీవికి కొడాలి నాని కౌంటర్
- ఏపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన చిరంజీవి
- ప్రభుత్వం ఎలా ఉండాలో చాలా మంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారన్న నాని
- జనసేన ఓ కామెడీ పార్టీ, జనసున్నా పార్టీ అని ఎద్దేవా
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన పరోక్ష విమర్శలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మనకెందుకురా బాబు.. మన డ్యాన్సులు, ఫైట్లు మనం చేసుకుందాం’ అని తమ వాళ్లకు కూడా సలహాలివ్వాలని ఎద్దేవా చేశారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పైనా కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం నడిపింది చంద్రబాబే. ఆ రోజు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదో చెప్పాలి. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకుంటానని చెప్పి ఎందుకు గాలికొదిలేశారు?” అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఒక 420 అంటూ కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు భయపడిపోతున్నారని అన్నారు. బయటి జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి పుంగనూరులో చంద్రబాబు గొడవ చేయించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోతారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలే ఆయనకు చివరివని అన్నారు.
జనసేనపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ‘‘జనసేన ఓ కామెడీ పార్టీ. అది జనసున్నా పార్టీ. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి.. నాలుగు చోట్ల ఓడిపోగలరు. చంద్రబాబుకు సేవ చేయడానికే పవన్ పార్టీ పెట్టారు” అని అన్నారు.