Germany: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు గుర్తింపు.. 13 వేల మంది ప్రజల తరలింపు

Second world war time bomb found in Germany

  • జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ నగరంలో టన్ను బరువున్న బాంబు గుర్తింపు
  • బాంబును నిర్వీర్యం చేసే ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్
  • 2021లో మ్యూనిక్ స్టేషన్ వద్ద పేలిన బాంబు

జర్మనీలోని డస్సెల్ డార్ఫ్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం రేపింది. ఈ బాంబు ఒక టన్ను బరువు ఉంటుంది. సిటీలోని జూ సమీపంలో ఈ బాంబును గుర్తించారు. ఈ క్రమంలో బాంబు ఉన్న ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరినీ అధికారులు అక్కడి నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. మరోవైపు ఈ బాంబును డిస్పోజ్ చేసే ఆపరేషన్ ను పోలీసులు, బాంబ్ స్క్వాడ్ చేపట్టారు. 

ఒక జర్మన్ పత్రిక కథనం ప్రకారం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 1940 - 1945 మధ్య కాలంలో బ్రిటీష్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ లు యూరప్ పై 2.7 టన్నుల బాంబులను జారవిడిచాయి. వీటిలో సగం బాంబులను జర్మనీపై వేశారు. 1945 మేలో జర్మనీలోని నాజీ ప్రభుత్వం సరెండర్ అయ్యే సమయానికి ఆ దేశంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మొత్తం నాశనమయ్యాయి. డజన్ల కొద్దీ నగరాలు బూడిదగా మారాయి. హిట్లర్ 1945 ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 

మరోవైపు, 2021 డిసెంబర్ లో మ్యూనిక్ స్టేషన్ సమీపంలోని ఒక కన్స్ స్ట్రక్షన్ సైట్ వద్ద రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. 2017లో ఫ్రాంక్ ఫర్ట్ లో 1.4 టన్నుల బరువైన బాంబును కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం నుంచి 65 వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

More Telugu News