Cricket: ఆటనే శ్వాసించడం అంటే ఇదే.. 83 ఏళ్ల వయసులో భుజానికి ఆక్సిజన్ సిలిండర్‌తో వికెట్ కీపింగ్
- 83 ఏళ్ల వయసులోనూ ఆటను వదలని స్కాట్లాండ్ క్రికెటర్ అలెక్స్ స్టీలీ
- ఆక్సిజన్ సిలిండర్‌తో మరీ గ్రౌండ్‌లోకి వచ్చి ఆడుతున్న వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆటనే శ్వాసగా భావించే క్రీడాకారులకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు స్కాట్లాండ్‌కు చెందిన 83 ఏళ్ల మాజీ క్రికెటర్ అలెక్స్ స్టీలీ. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన అలెక్స్ వయసు మీద పడినా ఆటను ఆపడం లేదు. మూడేళ్లుగా అతను శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడు. అయినప్పటికీ క్రికెట్‌కు దూరం కావడం లేదు. అంత ఇబ్బందిలోనూ ఓ మ్యాచ్‌లో భుజానికి ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకున్నాడు.
దాని నుంచి వస్తున్న ప్రాణ వాయువును పీలుస్తూ వికెట్ కీపింగ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ అయింది. దాంతో, అలెక్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడికి ప్రాణవాయువు సిలిండర్ నుంచి కాదు.. క్రికెట్ నుంచే అందుతోందని పలువురు కొనియాడుతున్నారు. 1960ల్లో స్కాట్లాండ్ క్రికెట్ జట్టులో సభ్యుడైన స్టీలీ 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పోటీ పడ్డాడు.