Chandrababu: అప్పటి వరకు చంద్రబాబు ఎంతో కలత చెందడాన్ని నేను కళ్లారా చూశా: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ
- 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం జరిగిందన్న లక్ష్మీనారాయణ
- గద్దర్ ను ఎలాగైనా బతికించుకోవాలంటూ చంద్రబాబు తనకు ఫోన్ చేశారని వెల్లడి
- మూడు రోజుల తర్వాత గద్దర్ కళ్లు తెరిచారని గుర్తు చేసుకున్న మాజీ ఐఏఎస్
ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు అనే భావన నుంచి ఇంకా ఎవరూ కోలుకోలేకపోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో గద్దర్ పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఆయన ఒక బుల్లెట్ ను తన శరీరంలోనే మోస్తూ బతికారు. 1997 ఏప్రిల్ 6న జరిగిన హత్యాయత్నంపై మాజీ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ స్పందించారు.
ఏప్రిల్ 6 సాయంత్రం గద్దర్ పై హత్యాయత్నం జరిగిందని... ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఫోన్ చేశారని లక్ష్మీనారాయణ చెప్పారు. గద్దర్ పై దాడి జరగడం బాధాకరమని, ఆయనను ఎలాగైనా బతికించుకోవాలని తనకు చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించండని ఆదేశించారని వెల్లడించారు. అప్పట్లో తాను ముఖ్యమంత్రికి డిప్యూటీ సెక్రటరీగా వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాలను చూస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు ఆదేశాలతో వైద్యా, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్జునరావుతో కలిసి నిమ్స్ ఆసుపత్రి కాకర్ల సుబ్బారావుతో మాట్లాడామని తెలిపారు. ఆ తర్వాత గద్దర్ కు ప్రత్యేకమైన చికిత్సను అందించామని... మూడు రోజుల తర్వాత ఆయన కళ్లు తెరిచారని చెప్పారు. అప్పటి వరకు చంద్రబాబు ఎంతో కలత చెందడాన్ని తాను కళ్లారా చూశానని తెలిపారు.
ఆ తర్వాత ఒక ఐదేళ్లకు ఓ వేడుకలో తాను, గద్దర్ కలుసుకున్నామని చెప్పారు. అప్పుడు గద్దర్ తనను ఆప్యాయంగా హత్తుకున్నారని.. దగ్గరుండి తన ప్రాణాలు కాపాడారంటూ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో తాము కలుసుకున్నామని... ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా మాట్లాడేవారని చెప్పారు. గద్దర్ మృతి వ్యక్తిగతంగా తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.