YS Jagan: 2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: వైఎస్ జగన్
- గొమ్ముగూడెంలో ముంపు బాధితులతో సమావేశమైన జగన్
- చంద్రబాబు హయాంలో ఇష్టం వచ్చినట్లు ప్లానింగ్ లేకుండా కట్టారని ఆగ్రహం
- ఏ బాధ వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం
2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ఆలస్యమైందన్నారు. వారు స్పిల్ వే కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్ల గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు.
పోలవరం ముంపు గ్రామాలను సందర్శించిన జగన్ గొమ్ముగూడెంలో ముంపు బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత ప్రభుత్వాల కంటే భిన్నంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టర్‌లకు అన్ని రకాల ఆదేశాలు ఇచ్చామన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. వరద సహాయక చర్యల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే పరిష్కరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టులో మూడు దశల్లో నీళ్లు నింపుతామన్నారు. చంద్రబాబు హయాంలో ఇష్టం వచ్చినట్లు ప్లానింగ్ లేకుండా కట్టారని చెప్పారు. అందుకే ముంపు సమస్య అన్నారు. ఏ బాధ వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పోలవరం ప్రాజెక్టును తాము ఎందుకు త్వరగా పూర్తి చేయలేకపోతున్నామో కూడా జగన్ తెలిపారు. 2013-14 ధరలతో ఇప్పుడు ఎలా పూర్తి చేస్తామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, ఈ కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులతో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించడం లేదన్నారు. జనవరి నాటికి రూ.5,200 కోట్లు వచ్చేలా చూస్తామన్నారు.
పోలవరం ముంపు బాధితులందరికీ న్యాయం చేస్తామని జగన్ చెప్పారు. వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్కరూ సాయం అందలేదనే మాటే అనడానికి వీల్లేకుండా సాయం చేస్తామన్నారు. వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. లిడార్ సర్వే సైంటిఫిక్‌గా జరిగిందని, అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.