Pawan Kalyan: టీడీపీ హయాంలో కొందరికే పరిహారం ఇచ్చారు... సమస్య అక్కడ్నించే మొదలైంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan held meeting with Mallapalli farmers
  • కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన
  • బాపులపాడు మండలం మల్లపల్లిలో రైతులతో సమావేశం
  • పవన్ ముందు గోడు వెళ్లబోసుకున్న పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులు
  • తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చిన జనసేనాని
  • టీడీపీపై సుతిమెత్తగా విమర్శలు 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లపల్లి పారిశ్రామికవాడ నిర్వాసిత రైతులతో సమావేశం అయ్యారు. పవన్ తో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో 2016లో ఇక్కడి భూములు తీసుకున్నారని, అయితే కొంతమందికే పరిహారం ఇచ్చారని వెల్లడించారు. దానివల్లే సమస్య మొదలైందని అన్నారు. 

"రైతులను కులాల వారీగా విభజిస్తే ఎలా? కేవలం ఒక కులం వారికే పరిహారం ఇస్తే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఒక కులం వారికే పరిహారం ఇస్తామంటే ఎలా? దయచేసి రైతులను కులాలవారీగా విభజించకండి" అని హితవు పలికారు. 

"వెయ్యి మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే.... ప్రభుత్వం ఎవరి నుంచైనా భూమిని తీసుకోవచ్చని రాజ్యాంగం చెప్పింది. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండగా, మల్లపల్లిలో అలా జరగలేదు. అధికారులు నియమనిబంధనలు పాటించాలి. ప్రభుత్వం చెప్పింది అంటూ రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేయొద్దు. 

2024లో కచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది. మల్లపల్లి రైతులకు న్యాయం జరిగేలా తప్పకుండా పోరాడతాం. ఇక్కడి రైతుల కన్నీళ్లు నాకు చాలా బాధను కలిగించాయి. మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తా" అంటూ పవన్ కల్యాణ్ మల్లపల్లి రైతులకు భరోసా ఇచ్చారు.

అంతేకాదు, రైతులను కులాల వారీగా చూడొద్దని టీడీపీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. రైతుల్లో అన్ని కులాల వారు ఉంటారని పేర్కొన్నారు. ఏ ఒక్క కులం వల్ల సమాజం నడవదని, టీడీపీ కూడా మల్లపల్లి రైతులకు అండగా ఉండాలని కోరుకుంటున్నానని వివరించారు.
Pawan Kalyan
Farmers
Mallapalli
Janasena
TDP
Krishna District

More Telugu News