direct to mobile tech: ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లో లైవ్ టీవీ..!
- డైరెక్ట్ టూ మొబైల్ టెక్నాలజీతో సాకారం
- దీనిపై భాగస్వాములతో చర్చిస్తున్న కేంద్ర సర్కారు
- వ్యతిరేకిస్తున్న టెలికం ఆపరేటర్లు
- వచ్చే వారం దీనిపై ఓ సదస్సు ఏర్పాటు
టీవీ చానళ్లను మొబైల్ ఫోన్లలో లైవ్ గా చూసే అవకాశం, అది కూడా ఇంటర్నెట్ లేకుండా లభిస్తే ఎంతో బావుంటుంది కదా..? త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం డీటీహెచ్, వైర్ రూపంలో టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నాం. ఈ అవసరం లేకుండా నేరుగా డైరెక్ట్ టూ మొబైల్ (డీటూఎం) సేవలు అందించాలన్నది ప్రతిపాదన. టెలికం శాఖ, కేంద్ర సమాచార ప్రసార శాఖ, ఐఐటీ కాన్పూర్ దీనిపైనే పనిచేస్తున్నాయి. ఈ వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా ప్రతిపాదనను టెలికం ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇది అమల్లోకి వస్తే టెలికం కంపెనీల డేటా ఆదాయం తగ్గిపోతుంది. టెలికం కంపెనీలకు ఇప్పుడు వాయిస్ కాల్స్ కంటే డేటా రూపంలోనే ఎక్కువ ఆదాయం వస్తుండడం గమనార్హం. తాము సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, టెలికం ఆపరేటర్లు సహా భాగస్వాములు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి వెల్లడించారు. వచ్చే వారం దీనిపై సమావేశం జరగనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం దేశంలో 21-22 కోట్ల కుటుంబాలకే టీవీలు ఉన్నాయి. అదే స్మార్ట్ ఫోన్లు అయితే 80 కోట్లకు చేరువ అయ్యాయి. 2026 నాటికి 100 కోట్లకు స్మార్ట్ ఫోన్ యూజర్లు పెరిగిపోనున్నారు. అన్ని టీవీ చానళ్లను డైరెక్ట్ గా మొబైల్ లో ఉచితంగా చూసే అవకాశం రాకపోయినా.. విద్యా సంబంధిత కంటెంట్ డెలివరీ, ఇతర అవసరాలకు దీన్ని వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. నెలవారీ కనీస చార్జీ చెల్లించడం ద్వారా యూజర్లు డైరెక్టర్ టూ మొబైల్ సేవలను అపరిమితంగా పొందే అవకాశం కల్పించాలని ఐఐటీ కాన్పూర్ సూచించింది.