Stalin: కేంద్రం, తమిళనాడు మధ్య మరోసారి 'హిందీ' రగడ

CM Stalin comments on Hindi language

  • దక్షిణాది రాష్ట్రాల్లో హిందీపై వ్యతిరేకత
  • హిందీ భాష విషయంలో కేంద్రం ఒత్తిళ్లు!
  • తీవ్రంగా ప్రతిఘటిస్తున్న తమిళనాడు
  • హిందీని అనుకరించి తాము బానిసలం కాబోమన్న సీఎం స్టాలిన్ 

పలు దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషపై వ్యతిరేక భావనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం హిందీపై వ్యతిరేకతను ఓ ఉద్యమస్థాయిలో కొనసాగిస్తోంది. తాజాగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. 

నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా... హిందీకి ఇతర భాషలు పోటీ కానేకాదని అన్నారు. అంతకుముందు ఆయన హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని కరాఖండీగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 

హిందీ ఆధిపత్యం తమకు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. హిందీ భాషను అనుకరించడం అంటే తాము బానిసలుగా మారినట్టేనని, తమిళనాడు అటువంటి పని ఎప్పటికీ చేయబోదని తేల్చి చెప్పారు. 

హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఎందుకు? కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంలేదా? ఈ విషయాన్ని మీరు ఎందుకు లెక్కలోకి తీసుకోరు? అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. ఎప్పుడైనా సొంత భాష, సొంత వారసత్వమే మనం ఏంటనేది నిర్వచిస్తుంది అని వ్యాఖ్యానించారు.

Stalin
Hindi
Tamil Nadu
Amit Shah
India
  • Loading...

More Telugu News