post office: ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే ఈ పోస్టాఫీస్ పథకంలోనే అధిక రాబడి
- ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐదేళ్ల డిపాజిట్ రేటు 7 శాతం లోపే
- ప్రైవేటు బ్యాంకుల్లోనూ దాదాపు ఇంతే రేటు
- ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ లో 7.5 శాతం
- దీనికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీఐ) గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం మీద రెపో రేటును 2.5 శాతం వరకు పెంచింది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి కట్టడిగా ఈ చర్య తీసుకుంది. దీంతో బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై రేట్లను పెంచాయి. అదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ రేట్లను మాత్రం కొంత తక్కువ సవరించాయి. దీంతో ఇప్పుడు ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ పై అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్ అన్నది 5.75 శాతం నుంచి గరిష్ఠంగా 6.7 శాతం మధ్య ఉంది.
ఎక్కువ శాతం ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ ఇది 6.2 శాతం నుంచి 7.25 శాతం మధ్యే ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఒక్క డీసీబీ బ్యాంక్ ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ పై 7.75 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ డిపాజిట్లతో పోల్చుకుంటే ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ లో రేటు మెరుగ్గా ఉంది. 7.5 శాతం రేటు ప్రస్తుతం అమల్లో ఉంది. పైగా ఇందులో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ (అసలుకు కలుపుతుంటారు) చేస్తారు. చెల్లించడం మాత్రం వార్షికంగా చేస్తుంటారు. పోస్టాఫీసు డిపాజిట్లకు కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ల కంటే పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్ లో రాబడి మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ లో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు.