Chandrababu: చంద్రబాబు, లోకేశ్ భద్రతపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం
- చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో దాడులు
- కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన కనకమేడల రవీంద్రకుమార్
- గత నెల చివరి వారంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ
- చంద్రబాబు, లోకేశ్ లకు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు
టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ ల పర్యటనల్లో తరచుగా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం పట్ల కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు పర్యటనల్లో దాడులు చోటుచేసుకోవడం పట్ల కేంద్రం స్పందించింది.
చంద్రబాబు, లోకేశ్ ల భద్రతపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సర్కారును కేంద్ర హోంశాఖ కోరింది. గత సంవత్సరం నవంబరులో చంద్రబాబు రోడ్ షోలో రాళ్ల దాడి ఘటనపై వివరాలు అందజేయాలని ఆదేశించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు పర్యటించే సమయంలో తగిన భద్రత కల్పించాలని ఏపీ డీజీపీకి, సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జులై చివరి వారంలో కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో దాడుల ఘటనలు చోటుచేసుకోవడం పట్ల టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ పైవిధంగా స్పందించింది. తమ పార్టీ అగ్రనేతలకు భద్రత కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని కనకమేడల తన ఫిర్యాదులో ఆరోపించారు.