- 2026 నాటికి సముద్రయాన్ ప్రాజెక్ట్
- నీటిలో మునిగే వాహనంతో మానవ సహిత యాత్ర
- వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం
చంద్రుడిపై అన్వేషణకు భారత్ చంద్రయాన్-3 ప్రాజెక్టును ఇటీవలే విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు దీన్ని నిర్వహిస్తోంది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభకు వెల్లడించారు.
సముద్రయాన్ అనేది తొలి సముద్రగర్భ మానవ సహిత యాత్ర. సముద్ర లోతుల్లోని వనరులు, జీవ వైవిధ్యం విశ్లేషణకు ఈ ప్రయోగాన్ని ఉపయోగించుకుంటామని మంత్రి తెలిపారు. లోతైన మహా సముద్ర మిషన్ గా దీన్ని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీ (అభివృద్ధికి సముద్ర వనరుల వినియోగం) విధానానికి సముద్రయాన్ ప్రాజెక్టు మద్దతుగా నిలుస్తుందన్నారు. అలాగే దేశ అభివృద్ధికి, జీవనోపాధికి, ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందన్నారు.
2026 నాటికి సముద్రయాన్ ప్రాజెక్టు సాకారం అవుతుందని మంత్రి రిజుజు తెలిపారు. చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. సముద్రంలోకి పంపించనున్న సబ్ మెర్సిబుల్ వాహనం పేరు మత్స్య 6000 అని చెప్పారు. సముద్రయాన్ ప్రాజెక్టు సహా డీప్ ఓషన్ మిషన్ కు ఐదేళ్లలో రూ.4,077 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తే, సముద్రగర్భ శాస్త్రప్రావీణ్యం కలిగిన దేశాలు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన భారత్ నిలవనుంది.