Income Tax: ఐటీ రిఫండ్ అంటూ సందేశం వచ్చిందా? లింక్‌పై క్లిక్ చేయమంటున్నారా? జాగ్రత్త మరి!
- ఐటీ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
- ఫేక్ ఐటీ రిఫండ్ సందేశాలు వస్తున్నాయని వెల్లడి
- వ్యక్తిగత వివరాలు చెప్పాలంటూ ఐటీ శాఖ సందేశాలు లేదా మెయిల్స్ పంపించదని స్పష్టీకరణ
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు జులై 31న ముగిసింది. ఇప్పుడు చాలామంది పన్నుచెల్లింపుదారులకు ఫేక్ ఐటీ రిఫండ్ సందేశాలు వస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆమోదం పొందాయంటూ సందేశాలు వస్తున్నాయని, ఇవన్నీ ఫేక్ సందేశాలని, ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి సందేశాలను ఎవరికీ పంపించదని, మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసమే ఇలాంటి సందేశాలు పంపిస్తుంటారని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పీఐబీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి ఓ ఫేక్ సందేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌నూ షేర్ చేసి, అందర్నీ హెచ్చరించింది.
మీలో ఎవరికైనా ఐటీ రిఫండ్ వచ్చిందంటూ సందేశం వస్తే.. మీ బ్యాంకు ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపిస్తే కనుక జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు ఐటీ రిఫండ్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగత వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ ఎలాంటి సందేశాలు లేదా మెయిల్స్ పంపించదని తెలిపింది. ఒకవేళ అలాంటి సందేశాలు వచ్చి ఉంటే లింక్ పైన క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంపించడం చేయవద్దని హెచ్చరించింది. అనుకోకుండా ఆ లింక్‌పై క్లిక్ చేసినా ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని పేర్కొంది. అంతేకాదు, ఆ లింక్‌ను కాపీ చేసి బ్రౌజర్‌లో వెతకడం చేయవద్దని హెచ్చరించింది.