Onions: ఉల్లిపాయల వాసనతో విమానంలో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

Onions smell returns the plane

  • కొచ్చి నుంచి షార్జా బయల్దేరిన ఎయిరిండియా విమానం
  • విమానం గాల్లో ఉండగా... ఘాటైన వాసన గుర్తించిన ప్రయాణికులు
  • వాసన ఎక్కడి నుంచి వస్తోందో అర్థంకాక అయోమయం
  • తిరిగి కొచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండైన విమానం
  • కార్గో విభాగంలో ఉల్లిపాయల పెట్టె నుంచి వాసన వస్తున్నట్టు గుర్తింపు

కొచ్చి నుంచి షార్జా వెళుతున్న ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన గందరగోళం సృష్టించగా, తప్పనిసరి పరిస్థితుల్లో పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఐఎక్స్-411 అనే నెంబరు గల ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం నిన్న రాత్రి కొచ్చి నుంచి షార్జా బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, విమానంలో ఘాటైన వాసన వస్తోందంటూ ప్రయాణికుల్లో కొందరు విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. 

ఆ వాసన ఎక్కడ్నించి వస్తోందో అర్థం కాకపోవడంతో విమాన సిబ్బందిలోనూ, ప్రయాణికుల్లోనూ అయోమయం నెలకొంది. అది మండుతున్న వాసన అయ్యుంటుందని కొందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని పైలెట్ వెనక్కి మళ్లించాడు. 

విమానం వెనక్కి మళ్లించారన్న ప్రకటన విని ప్రయాణికులు మరింత హడలిపోయారు. ఏదో పెద్ద కారణం ఉంటేనే విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నారని కలకలం రేగింది. కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగొచ్చిన ఆ విమానం ల్యాండవగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

అనంతరం ఆ విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చివరికి, విమానంలోని సరకు రవాణా కంటెయినర్ లో ఉన్న ఓ ఉల్లిపాయలు, కూరగాయల పెట్టె నుంచి ఆ వాసన వస్తున్నట్టు గుర్తించారు.

Onions
Plane
Air India Express
Kochi
Sharjah
  • Loading...

More Telugu News