Nara Lokesh: అన్నదాతలకు అండగా నిలవాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రావడం లేదు: నారా లోకేశ్

Lokesh Yuvagalam Padayatra in Vinukonda constituency

  • వినుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • నేటితో 2,300 కి.మీ మైలురాయి అందుకున్న పాదయాత్ర
  •  వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరణ
  • జగన్ పాలనపై విమర్శలతో ధ్వజమెత్తిన టీడీపీ యువనేత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నేడు  ఉత్సాహంగా సాగింది. 174వ రోజు యువగళం పాదయాత్ర గురువారం నగరాయపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. 

పాదయాత్ర ఈరోజు వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ యువనేత లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని లోకేశ్ తెలిపారు. 

ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2315.5 కి.మీ. మేర పూర్తయింది. సాక్షి కథనాలపై, నాటి స్కిల్ డెవలప్ మెంట్ విభాగం చైర్మన్ అజయ్ రెడ్డి ఆరోపణలపై మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళుతున్న కారణంగా 4-8-2023న లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. 5వ తేదీ ఉదయం వనికుంట నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

అంగలూరులో అరటిపంటను పరిశీలించిన లోకేశ్
 
వినుకొండ నియోజకవర్గం అంగలూరులో అరటితోట వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న అరటిగెలలను లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి రైతు శ్రీనివాసరావు తన కష్టాలను లోకేశ్ కు విన్నవించారు. పంట నష్టపోతే, ప్రభుత్వం నుంచి ఎటువంటి బీమా సొమ్ము అందడం లేదని వాపోయారు. ఏటేటా నష్టాలతో వ్యవసాయం చేయడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

నారా లోకేశ్ స్పందిస్తూ...

వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉండటం వల్లే రైతులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అన్నారు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలవాల్సిన జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రావడం లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఉద్యానవన రైతులకు డ్రిప్, ఇన్ పుట్ సబ్సిడీలతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. 

"అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి విదేశాలకు అరటి, చీనీ పంటల ఎగుమతికి చేయూతనిచ్చాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హార్టీకల్చర్ పంటలకు రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. మరో 9 నెలలు ఓపికపట్టండి, మీకోసం పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు" అని స్పష్టం చేశారు.

పలు గ్రామాల ప్రజలు తనను కలిసిన సందర్భంగా లోకేశ్ వ్యాఖ్యలు...

  • వైసీపీ నాయకులకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాలను పూర్తిగా గాలికొదిలేశారు. పంచాయతీలకు చెందిన కేంద్రం విడుదల చేసిన రూ.9 వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం దొంగిలించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామసీమల అభివృద్ధికి పెద్దపీట వేస్తాం.
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థుడు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 
  • జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిచ్చినా, వాటా సొమ్ము చెల్లించలేక పథకాన్ని అమలు చేయలేని చేతగాని ప్రభుత్వమిది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. 
  • కబ్జాకు గురైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.
  • ఈనాం భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల సమస్య ఉంది. అధికారంలోకి వచ్చాక సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ అనుభవదారులను గుర్తిస్తాం. 
  • దీర్ఘకాలంగా భూములను సాగు చేసుకుంటున్న వారికి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో చర్చిస్తాం. నిబంధనలకు లోబడి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
  • వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగాన్ని అప్పుల్లో ముందువరసలో నిలిపారు. గతంలో రూ.75 వేలు ఉన్న ఏపీ రైతుల సగటు అప్పు, ఇప్పుడు రూ.2.5 లక్షలకు చేరింది. 
  • రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న జగన్ ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2315.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.9 కి.మీ.*

*4-8-2023న పాదయాత్రకు విరామం.*

*(5-8-2023న ఉదయం వినుకొండ నియోజకవర్గం వనికుంటనుంచి పాదయాత్ర కొనసాగుతుంది.)*

******

  • Loading...

More Telugu News