health insurance: ఒకరికి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలో తెలుసా?
- పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, అనారోగ్య సమస్యలు
- వీటి కారణంగా ఆసుపత్రిలో చేరితే భారీగా బిల్లు
- ఒక వ్యక్తి కనీసం రూ.10 లక్షల కవరేజీ తీసుకోవాలన్నది సూచన
వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న అనారోగ్యానికే వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ఏదైనా ప్రమాదం లేదంటే కరోనా వంటి వైరస్ ప్రభావాలతో ఆసుపత్రిలో చేరితే బిల్లు వాచిపోయేంతగా చార్జీలు పడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామంటే ఒకరికి నిజంగా ఎంత కవరేజీ అవసరం? అన్నది తెలియదు. ఇది తెలుసుకున్నప్పుడే మెరుగైన కవరేజీని తీసుకోగలరు.
హెల్త్ ఇన్సూరెన్స్ ను యుక్త వయసులోనే తీసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఎందుకంటే ఆ వయసులో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉండవు. దాంతో ప్రీమియం తక్కువగా నిర్ణయం అవుతుంది. అంటే అందుబాటు ప్రీమియానికే సమగ్ర కవరేజీతో కూడిన హెల్త్ ప్లాన్ అనేది చిన్న వయసులో ఉన్న అనుకూలతగా చెప్పుకోవాలి. నేడు జీవనశైలి సమస్యలైన మధుమేహం, బీపీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగాయి. గుండె జబ్బులు, కేన్సర్ లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంత ముందుగా హెల్త్ కవరేజీ తీసుకోవాలి.
ముందుగా తాము నివసించే ప్రాంతంలోని ఆసుపత్రుల్లో చికిత్సా వ్యయాలు ఎలా ఉన్నాయో విచారించుకోవాలి. అప్పటికే తమకు ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కారణంగా వచ్చే సమస్యలకు చికిత్సా చార్జీలు తెలుసుకోవాలి. అందుకని ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయానికి 2 లేదా 3 రెట్ల మొత్తంతో హెల్త్ కవరేజీ తీసుకోవాలన్నది పాలసీ ఎన్షూర్ సహ వ్యవస్థాపకుడు ఎం మిశ్రా సూచన.
ఒక వ్యక్తి ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉంటే రూ.10 లక్షలకు కవరేజీ తీసుకోవాలని.. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి ఉంటే రూ.30 లక్షల వరకు కవరేజీ తీసుకోవాలని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ సింఘాల్ సూచించారు. పొగతాగే అలవాటు ఉన్న వారు, లేని వారు సైతం కనీసం రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నది ఇన్సూర్ దేఖో బిజినెస్ హెడ్ పంకజ్ గోయా సూచనగా ఉంది.