Om Birla: కలత చెందిన లోక్ సభ స్పీకర్.. ఇక సభకు హాజరుకానన్న ఓంబిర్లా!
- అధికార, ప్రతిపక్షాలపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి
- సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించేవరకు సమావేశాలకు దూరం
- బుధవారం స్పీకర్ స్థానంలో కనిపించని ఓంబిర్లా
పార్లమెంటు కార్యకలాపాలకు సభ్యులు అంతరాయం కలిగించడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అధికార, ప్రతిపక్షాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు సభ గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకు తాను సమావేశాలకు హాజరు కాబోనని చెప్పినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. బుధవారం లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ఓం బిర్లా స్పీకర్ స్థానంలో లేరు. బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి స్పీకర్ స్థానంలో కనిపించారు.
మణిపూర్ ఘటనపై లోక్ సభలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ పలుమార్లు వాయిదా పడుతోంది. ఈరోజు కూడా సభ ప్రారంభం కాగానే వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సమావేశమైనప్పటికీ, మళ్లీ రేపటికి వాయిదా పడింది. సభను సజావుగా సాగనీయాలని స్పీకర్ స్థానంలో కూర్చున్న సోలంకి పలుమార్లు కోరినప్పటికీ విపక్షాలు వినలేదు. దీంతో సభ వాయిదా పడింది.
సమాచారం మేరకు మంగళవారం లోక్ సభలో బిల్లుల ఆమోదం సందర్భంగా విపక్షాలు, ట్రెజరీ బెంచ్‌ల ప్రవర్తనతో బిర్లా కలత చెందినట్లుగా తెలుస్తోంది. సభా గౌరవాన్ని స్పీకర్ అత్యంత గౌరవంగా చూస్తారని, సభా కార్యకలాపాల సమయంలో సభ్యులు మర్యాదపూర్వకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లుగా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.