KTR: దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్!: కేటీఆర్ ధీమా

KTR says brs will win third time in Telangana

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందన్న మంత్రి
  • అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు రాజకీయం చేస్తే చాలని వ్యాఖ్య
  • కేసీఆర్ చెప్పిన మాటలను మొదట ఎవరూ నమ్మలేదన్న కేటీఆర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో లబ్ధిదారులకు భూక్రమబద్ధీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. 

అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు రాజకీయం చేస్తే చాలని, మిగతా నాలుగున్నరేళ్ళ పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాలన్నారు. ఇరవై నాలుగు గంటలూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరన్నారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆగస్ట్ 15 నుండి అక్టోబర్ లోపు నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు.

గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడువేల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పక్కా ఇళ్ల విషయంలో కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కేసీఆర్ వయస్సుకు గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. 

హైదరాబాద్ ప్రజల అవసరం దృష్ట్యా ఇప్పటికే 70 కిలో మీటర్ల మెట్రో రైలు మార్గం పూర్తయిందని, తక్కువ ఖర్చుతో ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలో మీటర్ల మెట్రోకు ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. భూసేకరణ పూర్తి చేశాక, 314 కిలో మీటర్ల మెట్రో మార్గాన్ని నాలుగేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. వందేళ్లను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

కేసీఆర్ మొదట ఏం చెప్పినా నమ్మలేదని, కానీ అన్నింటిని సుసాధ్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధిస్తానని కేసీఆర్ బయలుదేరిన రోజు చాలామంది నమ్మలేదని, దీనిని సాధ్యం చేశారని చెప్పారు. తెలంగాణ వచ్చాక తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కడతానని కేసీఆర్ చెబితే ఎవరూ నమ్మలేదన్నారు. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తయ్యేసరికి నలుగురైదుగురు ముఖ్యమంత్రులు మారుతారన్నారు. కానీ అయిదేళ్లలోనే కేసీఆర్ కాళేశ్వరాన్ని పూర్తి చేశారన్నారు. ఇంటింటికీ నల్లా, నల్గొండ ఫ్లోరైడ్ సమస్య, పాలమూరు వలసలు.. ఇలా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News