Yogi Adityanath: లేకపోతే హారతి ఇవ్వాలా?.. ‘బుల్డోజర్’ ట్రీట్‌మెంట్‌పై యోగి ఆదిత్యనాథ్!

Yogi Adityanath defends bulldozer action against criminals
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్డోజర్లు అవసరమన్న యోగి 
  • నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి
  • ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వాళ్లకు హారతులు ఇవ్వాలా? అంటూ ప్రశ్న
మాఫియా, నేరస్థులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఇస్తున్న ‘బుల్డోజర్‌‌ ట్రీట్‌మెంట్‌’ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు. తమ అభివృద్ధి ప్రయాణంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఏఎన్‌ఐ’ సంస్థతో పాడ్‌కాస్ట్‌లో యోగి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్డోజర్లు, ఆధునిక యంత్రాలు అవసరమని అన్నారు. 

‘‘యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలంటే.. నేటి యుగంలో గడ్డపారలు, పలుగులు ఉపయోగించలేం కదా? గతంలో ఏదైనా పనికి ఆమోదం తెలిపితే.. మాఫియా దిగేది. అక్రమ ఆస్తులను చేజిక్కించుకునేది. అలాంటి మాఫియాపై చర్యలు తీసుకునే ధైర్యం గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి” అని యోగి చెప్పారు. 

నేరస్థుల ఇళ్లను బుల్డోజర్లతో ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించగా.. ‘‘ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వాళ్లకు హారతులు ఇవ్వాలా? మాఫియా, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని యూపీ ప్రజలు కోరుకుంటున్నారు” అని చెప్పారు. తమ రాష్ట్రంలో ఆరేళ్లలో ఎలాంటి అల్లర్లు జరగలేదని, కర్ఫ్యూలు విధించలేదని యోగి చెప్పారు. ప్రజలు పండుగలను శాంతియుతంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు.

మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారినే టార్గెట్‌ చేస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై యోగి ఘాటుగా స్పందించారు. తనకు అన్యాయం జరిగిందని ఏ ఒక్క అమాయక ముస్లింనైనా చెప్పమనండని ఎదురు ప్రశ్నించారు. మతాలకు అతీతంగా చట్టం అందరికీ సమానమేనని స్పష్టం చేశారు. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని, ఏ మతం లేదా అభిప్రాయం ప్రకారం నడవదని అన్నారు.
Yogi Adityanath
bulldozer action
criminals
BJP
Uttar Pradesh

More Telugu News