LPG Gas Price: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ. 100 తగ్గింపు.. గృహ వినియోగదారులకు నిరాశ
- యథాతథంగానే డొమెస్టిక్ సిలిండర్ ధరలు
- తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి
- ఢిల్లీలో 19కేజీల సిలిండర్ ధర రూ. 1,680
- హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ. 1,155గా 14.2 కేజీల సిలిండర్ ధర
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్‌ను మాత్రం ముట్టుకోలేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 99.75 తగ్గించిన కంపెనీలు తగ్గిన ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి. ధర తగ్గింపుతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,680కి దిగి వచ్చింది. కోల్‌కతా, ముంబై, చెన్నైలో ధరలు వరుసగా రూ. 1802.50, రూ. 1,640.50, రూ.1,852.50గా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంది. చివరిసారి జులై 4న ధరలు సవరించింది. ఏప్రిల్, మే నెలలో ధరలు తగ్గించిన తర్వాత తొలిసారి జూన్‌లో సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ దాదాపు వందరూపాయలు తగ్గింది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం మార్చి 1 నుంచి ఇప్పటి వరకు సవరించలేదు. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103గా ఉండగా, కోల్‌కతాలో రూ. 1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50గా ఉంది. హైదరాబాద్‌లో 1,155గా ఉంది.