Mallu Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ కేసీఆరే: భట్టి

Bhatti Vikramarka slams CM KCR

  • తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
  • చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు
  • ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్న భట్టి విక్రమార్క
  • కేసీఆర్ రాత్రిపూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యాముల ప్లాన్లు గీశారని వ్యంగ్యం
  • కేసీఆర్ అనాలోచిత డిజైన్ల వల్ల ప్రజలు మునిగిపోతున్నారని ఆగ్రహం

తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపు ముప్పు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

భారీ వర్షాలు వస్తాయని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. 

కేసీఆర్... రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులను రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారని భట్టి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజినీర్ కేసీఆరే అని అన్నారు. కేసీఆర్ రాత్రిపూట డిజైన్ చేసి, మూడు చెక్ డ్యామ్ లకు ప్లాన్లు గీశారని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా చెక్ డ్యాములు కట్టడం వల్లే ఇంతటి ప్రమాదం వచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అనాలోచిత డిజైన్ల వల్ల ప్రజలు వరదల్లో మునిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఒక హెలికాప్టర్ అడిగితే స్పందించరు కానీ... రాజకీయ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపించి నాయకులను రప్పించి పార్టీ కండువాలు కప్పుతారని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు అలవాటేనని అన్నారు. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు.

Mallu Bhatti Vikramarka
KCR
Rains
Projects
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News