Team India: ఇంగ్లిష్ కౌంటీ జట్టుతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అజింక్యా రహానె
- క్రికెట్‌కు రెండు నెలలు దూరం అవుతున్న భారత ఆటగాడు
- కుటుంబంతో సమయం గడిపేందుకు నిర్ణయం
- లీస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో ఒప్పందం రద్దు చేసుకున్న రహానె
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానె ఇంగ్లండ్‌కు చెందిన కౌంటీ జట్టు లీస్టర్ షైర్ క్లబ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. క్లబ్‌తో కాంట్రాక్ట్ నుంచి రహానె మధ్యలోనే వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కాస్త విరామం కోరుకుంటున్న నేపథ్యంలో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవానికి రహానె జూన్‌లోనే ఆ కౌంటీ జట్టులో చేరాల్సి ఉంది. అయితే, ఐపీఎల్ తర్వాత నేరుగా ఇంగ్లండ్ వెళ్లిన రహానె ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో పాల్గొనడంతో లీస్టర్ షైర్ లో చేరలేకపోయాడు.
ఇప్పుడు మరో రెండు నెలలు (ఆగస్టు, సెప్టెంబర్) క్రికెట్ నుంచి విరామం కోరుతున్న నేపథ్యంలో అతను కౌంటీలకు దూరం అయ్యాడు. ‘అజింక్యా రహానె పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. గత కొన్ని నెలలుగా అతని షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. భారత జట్టుతో కలిసి చాలా ప్రయాణం చేశాడు. ఇప్పుడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. రహనెతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. ఆయన మళ్లీ ఆ జట్టుకు ఆడుతాడని భావిస్తున్నాం’ అని లీస్టర్‌షైర్ క్లబ్ తెలిపింది. రహానె స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను తమ జట్టులోకి తీసుకున్నట్లు క్లబ్ వెల్లడించింది.