Snake Smuggling: విమాన ప్రయాణికుడి నుంచి 47 పాములు.. 2 బల్లులు స్వాధీనం
- కౌలాలంపూర్ నుంచి తిరుచ్చి చేరుకున్న ప్రయాణికుడు
- అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగును తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు
- స్వాధీనం చేసుకున్న పాములను తిరిగి మలేసియా పంపే ఏర్పాట్లు
కేరళలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు 47పాములు, రెండు బల్లులతో పట్టుబడ్డాడు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో వీటిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ముహమ్మద్ మెయిదీన్‌గా గుర్తించారు.
బటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో వచ్చిన మెయిదీన్ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగును తెరిచిన అధికారులు షాకయ్యారు. అందులో ఉన్న చిన్నచిన్న పెట్టెలను తెరిస్తే బతికి ఉన్న వివిధ రకాలైన 47 పాములు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని పాములతోపాటు రెండు బల్లులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీటిని తిరిగి మలేసియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.