Amrit Bharat station scheme: అమృత్ భారత్ స్టేషన్ స్కీం.. ఏపీలో ఆధునికీకరించే రైల్వే స్టేషన్ల తొలి జాబితా
- మారనున్న పదకొండు స్టేషన్ల రూపురేఖలు
- ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన
- విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ వెల్లడి
దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీం’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీంలో భాగంగా వివిధ రాష్ట్రాలలో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి, వాటిలో మరిన్ని మెరుగైన వసతులు కల్పించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఈ స్కీంలో దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని 72 రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 11 స్టేషన్లను ప్రస్తుతం ఆధునికీకరించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.
ఏపీలో తొలివిడతలో ఎంపికైన రైల్వే స్టేషన్ల జాబితాను విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనున్నట్లు వివరించారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.